
Terrorism: ‘ఐసిస్’ ముప్పు కాదు.. కానీ, తలనొప్పి వ్యవహారం!
అఫ్గాన్ మంత్రి జబిహుల్లా ముజాహిద్
కాబుల్: అఫ్గాన్‌కు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే వాదనను కొట్టిపారేస్తూ.. వారిని త్వరలోనే అణచివేస్తామని తాలిబన్లు పేర్కొన్నారు. ఐసిస్‌ను అఫ్గానిస్థాన్‌కు ముప్పుగా పరిగణించడం లేదు.. కానీ, అదొక తలనొప్పిలా మారిందని తాలిబన్ల ప్రతినిధి, మంత్రి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ‘ఐసిస్.. దేశంలో కొన్ని చోట్ల చేసే పనులు తలనొప్పిగా మారాయి. కానీ.. ఆయా ఘటనలు జరిగిన వెంటనే వారిని తరిమికొట్టాం. వారి స్థావరాలూ కనుగొన్నాం’ అని ముజాహిద్ వివరించారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఇటీవల కాబుల్ శివారులో ఐసిస్- ఖొరసాన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. వారి రహస్య స్థావరాలను ధ్వంసం చేసేందుకూ ముమ్మర ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.
‘ఇప్పటికిప్పుడు ముప్పు లేదు’
ఇటీవల కాబుల్‌లోని ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. జబిహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ కార్యక్రమానికి హాజరైన తాలిబన్లు, పౌరులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో పది మందికి పైగా మరణించగా, 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక నగరంలో జరిగిన మొదటి ప్రధాన ఉగ్రదాడి ఇదే. ఈ ఘటన అనంతరం తాలిబన్లు.. ఐసిస్ ఉగ్రవాదుల ఏరివేత మొదలుపెట్టారు. మరోవైపు అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాల విషయమై గత నెలలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరు నుంచి 36 నెలల్లో అఫ్గాన్‌లో అల్ ఖైదా, ఐసిస్ మళ్లీ బలపడేందుకు అవకాశం ఉందని చెప్పారు. కానీ, ఇప్పటికిప్పుడు వారి నుంచి ఉగ్ర ముప్పు 9/11 దాడుల ఘటన కంటే తక్కువేనని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.