
israel: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఇజ్రాయెల్ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న 11 రోజుల హింసకు తెరపడింది. కాల్పుల విరమణను హమాస్ వర్గాలు నిర్ధారించాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న హింసలో దాదాపు 200 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. హమాస్ ఉగ్రవాదులు కొన్ని వందల సంఖ్యలో ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేశారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సేనలు దాడికి పాల్పడ్డాయి. రాకెట్లు, విమానాలతో గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడింది. ఈ హింసలో ఇరుదేశాల పౌరులు చనిపోయినప్పటికీ, వందల మంది పాలస్తీనియులు నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి వచ్చింది. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న అగ్రారాజ్యం అమెరికా కూడా హింస తగ్గేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాడులను తక్షణం ఆపేయాలంటూ ఇస్లామిక్ దేశాలు మొదటినుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కీలక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.