ఆ దేశంలో 10శాతం మందికి టీకా పూర్తి!

దేశ జనాభాలో పదిశాతం మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Published : 01 Jan 2021 18:18 IST

మరికొన్ని రోజుల్లోనే రెండో డోసుకు సిద్ధం

తెల్‌ అవివ్‌(ఇజ్రాయెల్‌): కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆయా దేశాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20కి పైగా దేశాలు టీకా పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో ఇజ్రాయెల్‌ మాత్రం మెరుపువేగంతో దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడి జనాభాలో పదిశాతం మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆ దేశం‌ వైపు చూస్తున్నాయి.

ఫైజర్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు డిసెంబర్‌ మూడో వారంలో ఇజ్రాయెల్‌ అనుమతి ఇచ్చింది. 20వ తేదీన టీకా పంపిణీ ప్రారంభించిన నెతన్యాహు ప్రభుత్వం.. ప్రస్తుతం నిత్యం దాదాపు లక్షన్నర మందికి వ్యాక్సిన్‌ అందిస్తోంది. అంతేకాకుండా ప్రజల్లో టీకాపై నమ్మకాన్ని కలిగించేందుకు ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహునే తొలిటీకా తీసుకున్నారు. ఇలా దాదాపు 93లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 10.2శాతం మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తాజాగా అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ముందస్తుగా అక్కడి ఆరోగ్య కార్యకర్తలకు, వైరస్‌ ప్రమాదం పొంచి ఉన్న వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు ఇప్పటి వరకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన నాలుగు మిలియన్ల కరోనా టీకా డోసులు అందాయి. వీటితో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరిన్ని వ్యాక్సిన్‌ డోసుల కోసం ఫైజర్‌తో పాటు మోడెర్నా సంస్థలను సంప్రదిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు.

ఆరోగ్య వ్యవస్థ, అవగాహనతోనే..
కరోనా తీవ్రత అధికంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలోనూ టీకా పంపిణీ కొనసాగుతోంది. అయితే అక్కడ మందకొడిగా సాగుతోన్న తీరుపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. కొత్త ఏడాది నాటికే దాదాపు 2కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం ఇప్పటివరకు 28లక్షల మందికే తొలి డోసు అందించినట్లు పేర్కొన్నారు. అదే అమెరికాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో మాత్రం వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇక్కడ పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో వేగంగా టీకా పంపిణీ సాధ్యమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు ఏర్పడకుండా ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో ప్రచారాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు. టీకా తీసుకున్న వారికి ‘గ్రీన్‌ పాస్‌పోర్టు’ విధానంలో రెస్టారెంట్లు, స్వేచ్ఛగా ప్రయాణం, క్వారంటైన్‌ ఆంక్షలు లేకుండా అధికారులు సౌలభ్యం కలిగిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్ చేసుకునే వారిసంఖ్య పెరుగుతోంది.

వారికి మాత్రం నో వ్యాక్సిన్‌..
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌ నియంత్రణలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌, ఘాజా ప్రాంతాల్లో నివసించే పాలస్తీనా వాసులకు మాత్రం టీకాలు ఇవ్వడం లేదు. అక్కడ స్థిరనివాసమున్న ఇజ్రాయెల్‌ ప్రజలకు మాత్రం టీకా ఇవ్వడం వ్యతిరేకతకు కారణమవుతోంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కోవాక్స్‌ కార్యక్రమం ద్వారా అక్కడి టీకా పంపిణీ చేసే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు దాదాపు 4,23,262 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,325 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..
ఇప్పటివరకు ఎంతమంది టీకా తీసుకున్నారంటే..
అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని