
Israel-Hamas: హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు
జెరూసలెం: హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. పాలస్తీనా నిరసనకారులకు, ఇజ్రాయెల్ సేనలకు మధ్య జరిగిన ఘర్షణలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆదివారం ఈ దాడులకు తెగబడింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఓ ప్రకటనలో తెలిపింది.
పాలస్తీనా భూభాగంపై ఆంక్షల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు హమాస్ ఉగ్రవాదుల మద్దతున్న పలువురు సరిహద్దుల్లో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ భద్రతా బలగాలపై దాడులు జరిపారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌కు చెందిన పలువురు గాయపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.
హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య ఈ ఏడాది మే నెలలో పరస్పర దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 260 మంది పాలస్తీనాకు చెందినవారు మరణించారు. వీరిలో 67 మంది చిన్నారులు, 39 మంది మహిళలు ఉన్నారు. 80 మంది ఉగ్రవాదులు సైతం మరణించారు. వీరితో పాటు ఇజ్రాయెల్ వైపు కూడా ప్రాణ నష్టం వాటిల్లింది. ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సాధారణ పౌరులు మరణించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.