
Dog Poop DNA: శునకాల వ్యర్థాలు వదిలేస్తే.. యజమానులకు భారీ జరిమానా!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లోని రెండో అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్ ప్రపంచంలోని అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటి. ఇంత అందమైన నగరానికి శునకాల వ్యర్థాల సమస్య పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు యజమానులకు జరిమానాలు విధించిప్పటికీ సమస్య అదుపులోకి రాలేదు. దీంతో శునకాల మలంతో ‘డీఎన్ఏ డేటాబేస్’ను రూపొందించే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. ఈ డేటాబేస్‌తో సదరు యజమానులకు మెయిల్ ద్వారానే భారీ జరిమానాలు విధించనున్నారు.
టెల్ అవీవ్ నగరవ్యాప్తంగా దాదాపు 40వేల శునకాలు ఉన్నాయని అంచనా. ఇక్కడ ప్రతి 11 మందిలో ఒకరికి ఓ శునకం ఉంది. ప్రస్తుతం అమలు చేయబోయే డీఎన్ఏ సాంకేతికతతో శునకాలు వదిలిన వ్యర్థాలను పరీక్షించి, యజమానిని సులువుగా గుర్తించనున్నారు. మెయిల్ ద్వారా సదరు వ్యక్తికి జరిమానా విధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. టెల్ అవీవ్ మున్సిపల్ అధికారి ఐటాన్ స్క్వార్ట్జ్ మాట్లాడుతూ.. ‘కొందరు శునక యజమానుల చర్యల వల్ల అద్భుతమైన నగర అందాలు నాశనమవుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి నెలా అర టన్నుకు పైగా వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. బాధ్యతాయుతమైన శునక యజమానులందరూ డేటాబేస్‌లో తమ జంతువుల సమాచారాన్ని కచ్చితంగా నమోదు చేయాలి. ఈ సాంకేతికత ద్వారా బహిరంగ ప్రదేశాల్లో విసర్జించే శునకాలను గుర్తించడం సులువవుతుంది’ అని పేర్కొన్నారు.
కుక్కల డీఎన్ఏతో డేటాబేస్ రూపొందించాలన్న ఆలోచన కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ.. ఈ తరహా ఆలోచన కొన్నిచోట్ల అమల్లో ఉంది. శునకాల దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో బ్రిటన్‌లోని గ్లౌసెస్టర్ షైర్ నగర పోలీసులు ‘డీఎన్ఏ ప్రొటెక్టెడ్’ పేరిట పెంపుడు జంతువుల డేటాబేస్‌ను రూపొందించారు. 75 యూరోలు చెల్లించి యజమానులు ఇందులో తమ శునకాల డీఎన్ఏను నమోదు చేసుకోవచ్చు. ఇది బ్రిటన్‌లోని పోలీసులందరికీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దొంగతనాలను అరికట్టవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.