Mossad: ‘అణు’ దొంగలపై మొస్సాద్‌ దాడి..!

పాక్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్‌  (Israel)గూఢచర్య సంస్థ మొస్సాద్‌ తీవ్ర యత్నాలు చేసింది. ఈ క్రమంలో మిత్రదేశాల కోవలకు వచ్చే సంస్థలను కూడా పేల్చి వేయడానికి వెనుకాడలేదు. ఈ విషయం తాజాగా స్విస్‌ పత్రిక

Published : 06 Jan 2022 02:00 IST

పాక్‌కు షాకిస్తూ జర్మనీ, స్విస్‌ కంపెనీల్లో పేలుళ్లు.. తాజాగా వెలుగులోకి..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాక్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్‌  (Israel) గూఢచర్య సంస్థ మొస్సాద్‌ తీవ్ర యత్నాలు చేసింది. ఈ క్రమంలో మిత్రదేశాల కోవలకు వచ్చే సంస్థలను కూడా పేల్చి వేయడానికి వెనుకాడలేదు. ఈ విషయం తాజాగా స్విస్‌ పత్రిక ఎన్‌జడ్‌జడ్‌ వెలుగులోకి తెచ్చింది. తొలుత ఆయా కంపెనీలకు చెప్పి చూసిన మొస్సాద్‌.. అవి మాట వినకపోవడంతో కంపెనీల యూనిట్లనే పేల్చేసింది. అప్పట్లో ఇరాన్‌-పాకిస్థాన్‌ (Pakistan) సంయుక్తంగా అణ్వాయుధ అభివృద్ధిపై పనిచేసినట్లు మొస్సాద్‌ అనుమానించింది.

‘గడ్డి తింటాం కానీ.. అణుబాంబును చేస్తాం’..?

1974లో భారత్‌ ‘స్మైలింగ్‌ బుద్ధ’ పేరిట అణు పరీక్షలు నిర్వహించింది. అప్పటికే పాకిస్థాన్‌ 1972 యుద్ధంలో చావు దెబ్బతిని రెండు ముక్కలైంది. ఆ తర్వాత రెండేళ్లకే భారత్‌ అణుపరీక్ష నిర్వహించడంతో పాక్‌ వణికిపోయింది. వాస్తవానికి పాక్‌ 1953లోనే ‘ది పాకిస్థాన్‌ అటామిక్‌ ఎనర్జీ కమిటీ’ని ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలకు అణు శిక్షణ మొదలు పెట్టింది. పాక్‌ తొలి ‘స్విమ్మింగ్‌పూల్‌’ రియాక్టర్‌ను 1965లో ప్రారంభించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో కుష్వంత్‌ సింగ్‌ రాసిన కథనం ‘ఫారెన్‌ అఫైర్స్‌ పాకిస్థాన్‌,ఇండియా అండ్‌ ది బాంబ్‌’లో పేర్కొన్నారు. అప్పటికే పాక్‌ రెండు యుద్ధాల్లో ఓడిపోయింది. ‘‘అవసరమైతే గడ్డి అయినా తింటాం లేదా పస్తులుంటాం.. కానీ మాకంటూ సొంతగా తయారు చేస్తాం (అణుబాంబు). మాకు వేరే మార్గం లేదు’’ అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. 1976 నాటికే.. నెదర్లాండ్స్‌ అణు టెక్నాలజీని డాక్టర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ దొంగతనం చేశాడు. దీనికి సంబంధించిన బ్లూప్రింట్లు, అణు పరికరాల సరఫరాదారుల జాబితాలను సేకరించాడు. పాక్‌ అణు కార్యక్రమంలో చేరాడు.  అదే సమయంలో ఇరాన్‌ కూడా అణ్వాయుధాల కోసం తీవ్రంగా యత్నిస్తోంది.

పశ్చిమదేశాల సంస్థల లోపాయకారీ సహకారం..

1980ల ప్రారంభంలో ఇరాన్‌ (iran) - పాకిస్థాన్‌ (Pakistan) దేశాలు సంయుక్తంగా అణుబాంబు అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆ సమయంలో ఇరాన్‌ అణు కార్యక్రమానికి జర్మనీ, స్విట్జర్లాండ్‌లోని కొన్ని సంస్థలు డబ్బుకు కక్కుర్తిపడి సహకరించాయి. 1987లో పాక్‌ అణు పితామహుడు డాక్టర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌, ఇరాన్‌ న్యూక్లియర్‌ కమిషన్‌ చీఫ్‌ మసూద్‌ నరాఘీలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. అదేసమయంలో మసూద్‌ వెంట జర్మన్‌ ఇంజినీర్లు గాటర్డ్‌ లెర్చ్‌ అండ్‌ హెయిన్జ్‌ మెబస్‌  కూడా ఉన్నారు. ఆ తర్వాత కూడా వీరు దుబాయ్‌, యూఏఈలో భేటీ అయ్యారు.

అణ్వాయుధ తయారీలో పాక్‌ వేగాన్ని కొంత అడ్డుకొనేందుకు అమెరికా.. జర్మనీ, స్విస్‌ ప్రభుత్వాల సాయం కోరింది. పాక్‌కు సహకరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలంది. పశ్చిమ జర్మనీలోని బాన్‌, స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ కంపెనీలను ఆపలేకపోయింది. దీంతో మొస్సాద్‌ (Mossad) ఏజెంట్లు రంగంలోకి దిగారు.

నెలల వ్యవధిలో ఆయా కంపెనీల్లో పేలుళ్లు..

పాకిస్థాన్‌ (Pakistan), ఇరాన్‌ (iran)లకు సహకరిస్తోన్న కంపెనీలు, సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు 1981లో నెలల వ్యవధిలో దాడులు చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన కోరా ఇంజినీరింగ్‌ చుర్‌లోని కీలక  ఉద్యోగి ఇంట్లో బాంబును పేల్చారు; ఆ తర్వాత మే 18వ తేదీన వాలిష్మిల్లర్‌ కంపెనీ ఫ్యాక్టరీ భవనాన్ని బాంబుతో పేల్చి ధ్వంసం చేశారు; ఎర్లాంజెన్‌లోని హంజ్‌ మెబస్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాన్ని కూడా పేల్చివేశారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అణు టెక్నాలజీని సరఫరా చేసే మిగిలిన కంపెనీలకు ఫోన్లు చేసి ఇంగ్లిష్‌, పొడి పొడి జర్మనీ పదాల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపు కాల్స్‌ను రికార్డ్‌ చేసుకోమని కూడా వారు చెప్పడం గమనార్హం. వాలిష్మిల్లర్‌ కంపెనీకి జరిగిందే మీకు కూడా జరుగుతుందని హెచ్చరించారు. లేయ్‌ బోల్డ్‌-హీరేయస్‌ పరిపాలన కార్యాలయం, ‘వీఏటీ’ కంపెనీ యజమాని, ఇతర ఉద్యోగులకు ఇలాంటి కాల్స్‌ వచ్చాయి. జర్మనీలోని దౌత్యకార్యలయ ఉద్యోగి తమను అణుపరికరాల వ్యాపారం మానుకొని.. వస్త్రపరిశ్రమ నిర్వహించుకోమని హెచ్చరించినట్లు ‘వీఏటీ’ కంపెనీ యజమాని స్విస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పేలుళ్ల వెనుక మొస్సాద్‌  హస్తం ఉన్నట్లు భావించినా.. బలమైన ఆధారాలు లభించలేదు. ‘ది నాన్‌-ప్రోలిఫరేషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా’ సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత స్వీకరించింది. అయితే ఈ సంస్థ వివరాలు ఎవరికీ తెలియదు. దర్యాప్తు సంస్థలు.. మొస్సాద్‌పైనే అనుమానం వ్యక్తం చేశాయి.

పాక్‌ బాంబు జర్మన్‌-స్విస్‌ అధికారుల నిర్లక్ష్యానికి ప్రతిరూపం..

అప్పట్లో స్విస్‌, జర్మన్‌ కంపెనీలు పాక్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదిర్‌ ఖాన్‌ నెట్‌వర్క్‌తో అంటకాగాయి. కేవలం పాకిస్థాన్‌ (Pakistan) ఇచ్చే మిలియన్ల డాలర్ల లాభం కోసం పౌర-అణు టెక్నాలజీకి వినియోగించే పరికరాలను ఇష్టారాజ్యంగా సరఫరా చేసినట్లు ది ఎన్‌జడ్‌జడ్‌ పత్రిక పేర్కొంది.  లేబోల్డ్‌-హీరేయస్‌, వాలిష్మిల్లర్‌, కోరా ఇంజినీరింగ్‌ చుర్‌,  బచ్‌ మెటల్‌ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సమయంలో జర్మన్‌, స్విస్‌ అధికారులు  పౌర-అణు టెక్నాలజీకి వినియోగించే పరికరాల (డ్యూయల్‌ యూజ్‌) విక్రయాల విషయంలో ఉదారంగా వ్యవహరించారు. ఈ కంపెనీలు విక్రయించిన చాలా పరికరాల్లో యూరేనియం 238ను శుద్ధి చేసి యూరేనియం 235గా మార్చే హైప్రెసిషన్‌ వాక్యూమ్‌ వాల్వ్‌ వంటివి  ఉన్నట్లు తేలింది. వీటి విక్రయాలపై స్విస్‌, జర్మనీలకు అమెరికా పంపిన హెచ్చరికలు వాషింగ్టన్‌లోని నేషనల్‌ సెక్యూరిటీ ఆర్కైవ్స్‌లో ఇప్పటికీ ఉన్నాయి. పాక్‌కు ఆయా కంపెనీల నుంచి ఎగుమతి అయ్యే పరికరాలపై నిఘాను స్విట్జర్లాండ్‌ పూర్తిగా గాలికొదిలేసిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ, స్విస్‌ దేశాలకు చెందిన చెరో అర డజను కంపెనీల నుంచి అణు పరికరాలు పాక్‌కు చేరినట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని