రోదసిలోకీ చతుర్భుజం!

చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఏర్పడ్డ ‘చతుర్భుజ కూటమి’ బలోపేతమవుతోంది. రోదసి రంగానికీ ఈ మైత్రి విస్తరిస్తోంది. ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో అంతరిక్ష..

Published : 17 Mar 2021 11:15 IST

అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో ఇస్రో బంధం బలోపేతం

బెంగళూరు: చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఏర్పడ్డ ‘చతుర్భుజ కూటమి’ బలోపేతమవుతోంది. రోదసి రంగానికీ ఈ మైత్రి విస్తరిస్తోంది. ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో అంతరిక్ష బంధాన్ని భారత్‌ పటిష్ఠం చేసుకుంటోంది. చతుర్భుజ కూటమి శిఖరాగ్ర సదస్సు గతవారం జరిగిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు; కీలక, సరికొత్త పరిజ్ఞానాలు, భవిష్యత్‌ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించడానికి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని కూటమి దేశాలు నిర్ణయించాయి. అంతరిక్ష రంగంలోనూ నాలుగు దేశాలు ఉమ్మడిగా సాగేందుకు అడుగులు వేస్తున్నాయి. అమెరికాతో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ‘నిసార్‌’ ఉపగ్రహం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక ఎస్‌-బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ను ఇటీవల రూపొందించింది. దీన్ని వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. చంద్రుడిపైకి భారత్‌ పంపే చంద్రయాన్‌-3లో నాసాకు చెందిన లేజర్‌ రిఫ్లెక్టోమీటర్‌ అరే (ఎల్‌ఆర్‌ఏ)ను అమర్చేందుకు రెండు దేశాలు కసరత్తు చేస్తున్నాయి.
 
ఇదే రీతిలో జపాన్‌తోనూ మైత్రిని ఇస్రో బలోపేతం చేసుకుంటోంది. భూ పరిశీలన, చంద్రమండలంపై అన్వేషణ, ఉపగ్రహ నేవిగేషన్‌ వంటి అంశాల్లో సాగుతున్న సహకారాన్ని రెండు దేశాల అంతరిక్ష సంస్థలు ఈ నెల 11న సమీక్ష జరిపాయి. అంతరిక్ష పరిస్థితిపై అవగాహన, నిపుణుల మధ్య సహకారం విషయంలో మైత్రికి అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించాయి. ఉపగ్రహ డేటా సాయంతో వరి పంట విస్తీర్ణం, గాలి నాణ్యతపై పర్యవేక్షణ వంటి కార్యకలాపాలను ఉమ్మడిగా చేపట్టాలని ఇస్రో, జపాన్‌ అంతరిక్ష సంస్థ (జాక్సా) నిర్ణయించాయి. 2023 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువానికి లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ (లూపెక్స్‌) పేరుతో ఒక వ్యోమనౌకను సంయుక్తంగా పంపాలని తీర్మానించాయి. ఇందుకోసం జపాన్‌.. 2.6 కోట్ల డాలర్లను కేటాయించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని