ISRO: ఇస్రో హ్యాట్రిక్‌.. ‘పుష్పక్‌’ మూడో ప్రయోగం సక్సెస్

ISRO: అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో చేపడుతున్న ప్రయోగం మరోసారి విజయవంతమైంది.

Published : 23 Jun 2024 12:47 IST

బెంగళూరు: పునర్వినియోగ వాహకనౌకల (రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌- RLV LEX) సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్‌ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌ ప్రయోగాలను చేపడుతోంది.

తద్వారా ఆర్‌ఎల్‌వీల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపింది. ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ (LEX-03) సిరీస్‌లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR)లో ఆదివారం ఉదయం నిర్వహించినట్లు వెల్లడించింది. ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌-01, ఎల్‌ఈఎక్స్‌-02 మిషన్‌ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్లు తెలిపింది. తద్వారా స్వయంప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించినట్లు వివరించింది.

నీట్‌ పరీక్షల్లో ‘మున్నాభాయ్‌’లు..వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!

‘పుష్పక్‌’ (Pushpak) పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ ద్వారా తీసుకెళ్లి రన్‌వేకి నాలుగు కిలోమీటర్ల దూరం, 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారవిడిచారు. అక్కడి నుంచి క్రాస్‌-రేంజ్‌ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ రన్‌వే దిశగా వచ్చింది. సెంటర్‌లైన్ వద్ద కచ్చితమైన సమాంతర ల్యాండింగ్‌ను ప్రదర్శించింది. తక్కువ ‘లిఫ్ట్-టు-డ్రాగ్’ నిష్పత్తితో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ కారణంగా ల్యాండింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్ల (kmph) కంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది. ఇది వాణిజ్య విమానాల్లో 260kmph, యుద్ధ విమానాల్లో 280kmph వరకు ఉంటుందని గుర్తుచేసింది.

రన్‌వేపై ల్యాండ్ కాగానే వాహకనౌక వేగం బ్రేక్‌ పారాచూట్‌తో 100kmphకు తగ్గిందని ఇస్రో తెలిపింది. అనంతరం ల్యాండింగ్‌ గేర్లు బయటకు వచ్చి వాహనం పూర్తిగా ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ సమయంలో స్థిరత్వం కోసం నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ వ్యవస్థ, రడ్డర్‌ను ఆర్‌ఎల్‌వీ ఉపయోగించుకున్నట్లు వెల్లడించింది. ఎల్‌ఈఎక్స్‌-02 ప్రయోగంలో ఉపయోగించిన రెక్కల వాహనం, ఫ్లయిట్‌ సిస్టమ్స్‌ను ఎలాంటి మార్పులు లేకుండా తాజా ప్రయోగంలో వాడినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని