ISRO: శుక్రుడి వద్దకు ఇస్రో యాత్ర.. 2024 చివర్లో మిషన్‌..!

చంద్రుడు, అంగారకుడిపైకి ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో గ్రహంపై దృష్టిపెట్టింది. సౌర వ్యవస్థలోనే అత్యంత వేడి గ్రహంగా చెప్పే శుక్ర గ్రహం(వీనస్‌)

Published : 04 May 2022 19:23 IST

దిల్లీ: అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో గ్రహంపై దృష్టిపెట్టింది. సౌర వ్యవస్థలోనే అత్యంత ఉష్ణ గ్రహంగా పేర్కొనే శుక్రుడి(వీనస్‌) చెంతకు ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు.

ఈ మిషన్‌పై ఇస్రో బుధవారం సుదీర్ఘ చర్చలు చేపట్టింది. ఈ సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘అత్యంత తక్కువ సమయంలో శుక్ర గ్రహం చెంతకు మిషన్‌ చేపట్టడం భారత్‌కు సాధ్యమే. ఆ సామర్థ్యం మనకు ఉంది. ఇందుకోసం ఇప్పటికే ప్రాజెక్ట్‌ రిపోర్ట్ సిద్ధమైంది. నిధులు కూడా సమకూరాయి’’ అని తెలిపారు. 2024 చివర్లో శుక్ర గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపాలని ప్రణాళికలు చేస్తున్నట్లు సోమనాథ్‌ చెప్పారు.

భూమిపై ఉన్నట్టుగానే శుక్ర గ్రహంపై ఒకప్పుడు జంతుజాలానికి అనువైన వాతావరణం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే కాలక్రమేణా అది అత్యంత ఉష్ణోగ్రతగా మారిందని అంటారు. అంతేగాక, ఈ గ్రహంపై వాతావరణం విషపూరితంగా ఉండటమే గాక, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ మేఘాలు ఉంటాయని చెబుతారు. అయితే ఈ గ్రహం ఎందుకిలా మారిందన్నది ఇప్పటికే రహస్యమే.

ఈ నేపథ్యంలోనే వీనస్‌పై రహస్యాలను ఛేదించేందుకు అమెరికా సహా పలు దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇస్రో కూడా ఈ దిశగానే మిషన్‌ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. శుక్రుడి ఉపరితలంపై ఎలాంటి వాతావరణం ఉంది.. సల్ఫ్యూరిక్‌ ఆమ్ల వర్షాల కారణాలేంటీ అనేదానిపై ప్రయోగాలు చేపట్టనుంది. ఇందుకోసం వీనస్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించేందుకు సిద్ధమవుతోంది. అటు నాసా కూడా శుక్రుడి చెంతకు రెండు వ్యోమనౌకలకు పంపనుంది. ఇందుకోసం బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు నిధులను సమకూర్చుకుంది. 2028-2030 మధ్య డావిన్సీ +, వెరిటాస్‌ పేరుతో రెండు ప్రయోగాలు చేపట్టనుంది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ కూడా వీనస్‌పై మిషన్‌ను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని