పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు.. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.

Updated : 28 Feb 2021 11:26 IST

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు  ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు.  ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక-సి51 (పీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకె ళ్లింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ 17 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 

ఇది ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం కాగా... మొదటి ప్రయోగ వేదిక నుంచి 39వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌ వర్షన్‌లో మూడోది. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్‌ దేశ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి మార్కోస్‌ క్వాంటస్‌ షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.  పీఎస్‌ఎల్‌వీ-సి51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 

అంతరిక్షంలోకి మోదీ ఫొటో...
ఉప గ్రహం ద్వారా అంతరిక్షంలోకి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పంపారు. మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్‌ మిషన్‌ పేరు, భగవద్గీత కాపీ, వెయ్యిమంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లను అంతరిక్షంలోకి పంపించినట్టు ఇస్రో తెలిపింది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ...ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇస్రో, బ్రెజిల్‌ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం గర్వంగా ఉంది. బ్రెజిల్ జట్టుకు అభినందనలు. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టాం’’ అని శివన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు