ISRO: కుంగిపోతోన్న జోషీమఠ్‌.. వెబ్‌సైట్‌లో ఆ నివేదిక మిస్సింగ్‌..!

జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగుతున్నట్లు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ వెల్లడించిన నివేదికతో అక్కడి ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇదే సమయంలో జోషీమఠ్‌ నివేదిక ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి ఆ నివేదిక కనిపించడం లేదు. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలోనే ప్రభుత్వం దానిని తొలిగించినట్లు తెలుస్తోంది. 

Updated : 14 Jan 2023 17:36 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో కొంతకాలంగా భూమి వేగంగా కుంగిపోతోందని ఇస్రో నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెం.మీ మేర కుంగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలతో కూడిన నివేదికను ఇటీవల నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(NRSC) విడుదల చేసింది. దీనిపై జాతీయ, స్థానిక మీడియాల్లోనూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆ నివేదిక కనిపించకుండా పోయింది. అయితే, ఎన్‌ఆర్‌ఎస్‌సీ రిపోర్టు విడుదలైన తర్వాత ప్రజలు, మీడియా సొంత కోణంలో వివరణలు ఇస్తుండటం జోషీమఠ్‌తోపాటు దేశవ్యాప్తంగా గందరగోళానికి దారితీసినట్లు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA) పేర్కొంది. అందుకే వీటికి సంబంధించిన సమాచారాన్ని మీడియాతో పంచుకోకపోవడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయవద్దని ప్రభుత్వ విభాగాలకు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపింది.

కేంద్ర హోంశాఖతో సమావేశమైన మరుసటి వెబ్‌సైట్‌లో ఈ నివేదిక తొలగించడం గమనార్హం. జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగిపోతోందని చెప్పే ఆధారాలను కార్టోశాట్‌-2 ఎస్‌ ఉపగ్రహం చిత్రించింది. డిసెంబరు 27- జనవరి 8వ తేదీ మధ్య 12 రోజుల వ్యవధిలో ఈ పట్టణంలో భూమి 5.4 సెంటీమీటర్లు.. గతేడాది ఏప్రిల్‌- నవంబరు మధ్యలో 8.7 సెం.మీ. వరకు భూమి కుంగినట్లు గుర్తించింది. అయితే, అప్పుడు చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ జరిగినప్పటికీ.. ఇటీవల మాత్రం కుంగుబాటు వేగం పెరగడంతో పాటు దాని పరిధి కూడా విస్తరించిందని ఎన్‌ఆర్‌ఎస్‌సీ వివరించింది. 2,180 మీటర్ల ఎత్తులో ఉన్న జోషీమఠ్‌- అవులి రహదారిలోనూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని