Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు

చంద్రుడిపై తెల్లవారుజాము కావడంతో చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లతో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణకు ఇస్రో సిద్ధమైంది.

Published : 22 Sep 2023 01:52 IST

బెంగళూరు: చంద్రుడిపై తెల్లవారుజాము కావడంతో చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లతో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణకు ఇస్రో సిద్ధమైంది. ఆ రెండింటినీ నిద్రాణస్థితి నుంచి బయటకు తీసుకురావడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక వేళ ఇది విజయవంతమైతే.. జాబిల్లిపై చంద్రయాన్‌-3 ప్రయోగాలకు బోనస్‌ అందినట్లు అవుతుంది. అయితే, అక్కడ అత్యంత శీతల ఉష్ణోగ్రతలను తట్టుకొన్న అవి.. తిరిగి ఎంతవరకు రీఛార్జి అవుతాయనే విషయం ఆసక్తికరంగా మారింది.

భూమి నుంచి వచ్చే ఎలక్ట్రాన్ల ద్వారా జాబిల్లిపై నీరు

జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ల్యాండర్‌, రోవర్‌లను 14 రోజులు పనిచేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే, శివ్‌శక్తి పాయింట్‌ వద్ద పగటి సమయం ముగిసి చీకట్లు కమ్ముకోవడంతో ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్‌, రోవర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపించారు. ఆ సమయంలో అక్కడ మైనస్‌ 120 నుంచి 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా. సెప్టెంబర్‌ 20 నుంచి ల్యాండింగ్‌ ప్రాంతంలో తిరిగి తెల్లవారుజాము (14 రోజులు) ప్రారంభమవుతుంది. పూర్తి సూర్యోదయం కావడానికి రెండు రోజులు పడుతుంది. దీంతో సెప్టెంబర్‌ 22న ల్యాండర్‌, రోవర్‌ల సోలార్‌ ప్యానెళ్లు పూర్తిగా రీఛార్జి అయ్యే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలను ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకొని, తిరిగి రీఛార్జి కావడంపైనే వాటి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే వాటితో కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని ఇస్రోకు చెందిన స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేష్‌ దేశాయ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని