Isro: దేశీయ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో..!

ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దేశీయంగా తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ను బుధవారం పరీక్షించింది.

Published : 10 Nov 2022 13:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఎల్‌వీఎం-3 (ది లాంఛ్‌వెహికల్‌ మార్క్‌-3) కోసం నిర్మించిన ఇంజిన్‌కు హాట్‌టెస్ట్‌ నిర్వహించారు. 450 కిలోల వరకు పేలోడ్‌ను మోసుకెళ్లేలా ఈ ఇంజిన్‌ను రూపొందించారు. గతంలో పరీక్షించిన ఇంజిన్లతో పోలిస్తే ఈ సారి చాలా మార్పులు చేసినట్లు ఇస్రో పేర్కొంది. సరికొత్తగా థ్రస్ట్‌ నియంత్రణ కోసం థ్రస్ట్‌ కంట్రోల్‌ వాల్వ్‌ను అమర్చినట్లు పేర్కొంది. తొలిసారి 3డీ ప్రింటింగ్‌ విధానంలో తయారు చేసిన టర్బైన్‌ ఎగ్జాస్ట్‌ కేసింగ్‌ను కూడా వాడారు. ఈ పరీక్షలో అనుకున్న ప్రమాణాలను అందుకొన్నట్లు ఇస్రో వెల్లడించింది.

 ఇస్రో మొదటిసారిగా ఎల్‌వీఎం వాహకనౌక ద్వారా ఆరు టన్నుల బరువుగల విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో ఒప్పందం మేరకు ‘వన్‌వెబ్‌’కు చెందిన 36 ఉపగ్రహాలను దశల వారీగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది.  దీనిని స్వదేశానికి చెందిన ఓషన్‌ రీసెర్చ్‌ వెస్సెల్‌ ‘సాగర్‌ నిధి’ నుంచి ట్రాక్‌ చేశారు. పోస్ట్‌-లాంచ్‌ మిషన్‌ స్థితిని దీని సాయంతో నిశితంగా పరిశీలించారు. 2023లో వన్‌వెబ్‌కు చెందిన మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో మార్పులు చేసి ఇస్రో ఎల్‌వీఎం-3ను అభివృద్ధి చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని