చంద్రయాన్‌ 3 పరీక్షలు పూర్తి.. లాంచ్‌ అయ్యేది ఆ నెలలోనే

ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగం చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష విభాగం వెల్లడించింది. చంద్రయాన్-2 మిషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు, అంతర్జాతీయ నిపుణుల సూచనల ఆధారంగా.. చంద్రయాన్-3 మిషన్‌కు

Published : 03 Feb 2022 22:32 IST

దిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగం చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష విభాగం వెల్లడించింది. చంద్రయాన్-2 మిషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు, అంతర్జాతీయ నిపుణుల సూచనల ఆధారంగా.. చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపింది. ఇప్పటికే అవసరమైన పరీక్షలు పూర్తయ్యాయని, ఆగస్టులో లాంచ్ చేయనున్నట్లు చెప్పింది. 2019 జులైలో చేపట్టిన చంద్రయాన్‌- 2 ప్రయోగంలో భాగంగా ఇందులోని ల్యాండర్‌, రోవర్‌.. చంద్రుడి ఉపరితలంపై క్రాష్‌ ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన దాదాపు మూడేళ్ల తరువాత.. ఇస్రో ‘చంద్రయాన్-3’కి సిద్ధమైంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రకటించిన చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడో యాత్ర కానుంది. దీంతోపాటు అంతరిక్ష విభాగం తన 2022 టైమ్‌లైన్‌నూ విడుదల చేసింది.

వాస్తవానికి చంద్రయాన్‌-3ని 2021లోనే ప్రయోగించాల్సి ఉంది. అయితే, ఈ మిషన్ వెనుక నిరంతర జాప్యంపై ప్రశ్నలకు శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఇదివరకే షెడ్యూల్‌ చేసిన అనేక అంతరిక్ష కార్యక్రమాలు ప్రభావితమైనట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు, డిమాండ్‌ ఆధారిత ప్రాధాన్యాల ప్రాతిపదికన ఈ ఏడాదిలో 19 ప్రయోగాలు చేపట్టేందుకు అంతరిక్ష విభాగం ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ఎనిమిది రాకెట్‌, ఏడు స్పేస్‌క్రాఫ్ట్, నాలుగు సాంకేతిక ప్రదర్శన సంబంధిత మిషన్‌లు ఉన్నాయని కేంద్ర మంత్రి తన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. మరోవైపు, ఈ ఏడాది తొలి అంతరిక్ష ప్రయోగం ఫిబ్రవరి మధ్యలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్‌వీ సాయంతో రాడార్ ఇమేజింగ్, నిఘా కోసం ఉపయోగించే ‘రిశాట్‌-1ఏ’ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన తేదీని వెల్లడించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని