Karnataka: కర్ణాటకలో ‘హిజాబ్‌’ వివాదం.. కమల్‌హాసన్‌ కీలక వ్యాఖ్యలు

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను హిజాబ్‌ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది

Published : 09 Feb 2022 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను హిజాబ్‌ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ఈ వివాదంపై ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. వస్త్రధారణ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఈ వివాదం అమాయక విద్యార్థుల మధ్య విషపు గోడగా నిలుస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మారుతోంది. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా’’ అని కమల్‌హాసన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మలాలా విచారం..

హిజాబ్‌ వివాదంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత.. బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా యూసఫ్‌జాయ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. హిజాబ్‌లో వస్తోన్న బాలికలను చదువుకోనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ‘‘చదువా.. హిజాబా.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునేలా కాలేజీలు బలవంతపెడుతున్నాయి. హిజాబ్‌ ధరించిన అమ్మాయిలను చదువుకు తిరస్కరించడం దారుణం. భారత నేతలు దీన్ని ఆపాలి’’ అని మలాలా ట్విటర్‌లో రాసుకొచ్చారు.

కర్ణాటకలో జనవరి 1 న మొదలైన హిజాబ్‌ వస్త్రధారణ వివాదం నానాటికీ తీవ్ర రూపం దాల్చింది. నిన్న ఉడుపి, బెళగావి, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొన్ని చోట్ల ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం.. కాలేజీలు, స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని