
Ajit Pawar: మహా డిప్యూటీ సీఎంకు ఐటీ షాక్.. రూ.1000కోట్ల ఆస్తుల జప్తు
ముంబయి: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్‌కు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ గట్టి షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.1000కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని నారిమన్ పాయింట్‌లో గల నిర్మల్ టవర్‌తో పాటు మహారాష్ట్ర, దిల్లీ, గోవాల్లో ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందులో అజిత్ పవార్ కుటుంబానికి చెందిన కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణ దిల్లీలో రూ.20కోట్ల విలువ చేసే ఫ్లాట్, నిర్మల్ టవర్‌లో రూ. 25కోట్ల విలువ చేసే పార్థ్ పవార్(అజిత్ కుమారుడు) ఆఫీసు, రూ.600 కోట్ల విలువైన షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో ఓ రిసార్టును అధికారులు అటాచ్ చేసినట్లు సమాచారం. ఇవన్నీ అజిత్ పవార్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన ఆస్తులని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
గత నెల అజిత్ పవార్ సోదరీమణుల నివాసాలు, కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.184కోట్ల మేర లెక్కకు రాని ఆదాయాన్ని గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ సోదాలపై అప్పట్లో అజిత్ స్పందిస్తూ.. తమ ఆదాయానికి సంబంధించి రెగ్యులర్‌గా పన్నులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తమపై ఈ దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు.