Updated : 11 Aug 2022 14:01 IST

IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!

ముంబయి: మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని ఓ బిజినెస్‌ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల విస్తృతంగా సోదాలు (IT Raids) చేపట్టింది. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు రూ.56 కోట్ల నగదు లభ్యమవ్వగా.. దీన్ని లెక్కించడానికి అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టిందట. దీంతో పాటు వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు.

ఐటీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్నాలో స్టీల్‌, వస్త్రాలు, రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారం చేసే ఓ సంస్థ గత కొన్నేళ్లుగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈ నెల 1 నుంచి 8 వరకు 260 మంది ఐటీ సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆ సంస్థ యజమాని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు.

ఈ సోదాల్లో మొత్తం రూ.56 కోట్ల నగదు, రూ.14 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను అధికారులు జప్తు చేసుకున్నారు. ఇతర ఆస్తులను చెందిన డిజిటల్‌ డేటా, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తాన్ని అధికారులు ఐటీ ఆఫీసుకు తీసుకురాగా.. 13 గంటలకు పైగా శ్రమించి లెక్కించారట. ఈ సోదాల్లో దాదాపు రూ.390 కోట్ల మేర లెక్కల్లోకి రాని బినామీ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల, పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులోనూ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసాల్లో నోట్ల గుట్టలను ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఆ మధ్య యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లోనూ నోట్ల గుట్టలు బయటపడిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మహారాష్ట్రలోనూ ఇలా నోట్ల గుట్టలు కనిపించాయి. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని