Covid: పౌరుల ప్రాణాలు కాపాడటం మా బాధ్యత.. అందుకే ఆంక్షలు: ‘మహా’ సర్కార్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబయి లోకల్‌ రైళ్లలో ప్రయాణికులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వ్యాక్సినేషన్‌ పూర్తికాని వారు రైళ్లలో ప్రయాణించడాన్ని నిషేధించింది. కాగా.. ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు చట్టవిరుద్ధమని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ బాంబే హైకోర్టులో

Published : 05 Feb 2022 02:30 IST

ముంబయి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబయి లోకల్‌ రైళ్లలో ప్రయాణికులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వ్యాక్సినేషన్‌ పూర్తికాని వారు రైళ్లలో ప్రయాణించడాన్ని నిషేధించింది. కాగా.. ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు చట్టవిరుద్ధమని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ జరపగా.. రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయం సరైందేనని సమర్థించుకుంది.

ఈ కేసులో ప్రభుత్వం తరఫు న్యాయవాది అనిల్‌ అంతుర్కర్‌ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ‘‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం కోసమే రైళ్లలో వ్యాక్సిన్‌ వేసుకోని వారిని ప్రభుత్వం అనుమతించట్లేదు. ఒక సంక్షేమ రాష్ట్రంగా పౌరులు కరోనా బారిన పడి మరణించకుండా కాపాడుకోవడం మా(ప్రభుత్వ) బాధ్యత. ఆఖరికి ఈ వ్యాజ్యం వేసిన పిటిషనర్‌ ప్రాణాలు కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఆయన(పిటిషన్‌) తన ప్రాణాలకు విలువ ఇవ్వకపోవచ్చు. కానీ, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన అవసరముంది’’ అని న్యాయవాది తెలిపారు.

వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు.. ప్రభుత్వ నిర్ణయాలు సమాజంలోని ఏ వర్గానికైనా భంగం కలిగించాయేమో తాము పరిశీలించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలపై రాష్ట్ర నిపుణుల కమిటీ సరైన కసరత్తులు చేసిందా అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించారు. నిపుణుల కమిటీ సమావేశానికి సంబంధించి, రైలు ప్రయాణాలపై విధించిన ఆంక్షలకు సంబంధించి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని