Innovative Wedding card: వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కాదు.. వినూత్న పెళ్లి పత్రిక

దేశంలో కరోనా మూడో దశ ప్రారంభమైంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

Published : 13 Jan 2022 09:53 IST

జలగావ్‌ (మహారాష్ట్ర): దేశంలో కరోనా మూడో దశ ప్రారంభమైంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు టీకా తప్పని సరిగా వేసుకోవాలని సూచిస్తున్నాయి. వివాహాది కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుపుకోవాలనే నిబంధనలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలోని ఓ వివాహ ఆహ్వాన పత్రిక అందరి దృష్టిని ఆకర్షిచింది. వెడ్డింగ్‌ కార్డ్‌పై ఓ పేజీ మొత్తం కరోనా నిబంధనలను సూచిస్తూ ప్రచురించారు.జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు అనిల్‌ కెర్హలే తమ కుమార్తె నికితా కేర్హలేకు త్వరలో పెళ్లి చేస్తున్నారు. నికిత కూడా మీడియాలోనే ఉద్యోగం చేస్తున్నారు. చేతన్‌ అనే వరుడితో ఫిబ్రవరి 5న ఆమె పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది. కానీ అనూహ్యంగా వారి జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో అధికారులు కఠిన నిబంధనలను విధించార. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనిల్‌ కెర్హలే ఓ ప్రత్యేకమైన వెడ్డింగ్‌ కార్డ్‌ను తయారు చేయించారు. పేజీ పైభాగంలో భౌతిక దూరం, శానిటైజేషన్‌ ప్రాముఖ్యాన్ని బొమ్మలతో సూచించారు.

పైభాగంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తును ముద్రించారు. అతిథులను ఉద్దేశిస్తూ..‘మీ వ్యాక్సినేషన్‌ మా పెళ్లి కానుక’ అని రాశారు. కింది భాగంలో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ గుర్తును వేశారు. వెడ్డింగ్‌ కార్డ్‌ మరో పేజీని వధూవరుల పేర్లు, వేడుక జరిగే ప్రదేశం సహా ఇతర వివరాలకు కేటాయించారు. ఈ పత్రికను జిల్లా కలెక్టర్‌ అభిషేక్‌ రౌత్‌కు అందించి పెళ్లికి ఆహ్వానించారు. కరోనా పరిస్థితుల్లో అనిల్‌ కెర్హలే అనుసరించిన ఈ విధానాన్ని కలెక్టర్‌ ప్రశంసించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని