కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం: రాహుల్‌

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ మహిళా మంత్రి ఇమర్తి దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. కమల్‌నాథ్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Updated : 20 Oct 2020 16:40 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. మహిళా మంత్రిపై కమల్‌నాథ్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కమల్‌నాథ్‌ మా పార్టీకి చెందిన వారే కావచ్చు. కానీ, ఆయన ఉపయోగించిన భాష నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు. ఎవరైనా సరే అలాంటి భాష ఉపయోగించడాన్ని నేను అంగీకరించను. ఆయన అలా అనడం దురదృష్టకరం’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ కామెంట్లపై కమల్‌నాథ్‌ తిరిగి స్పందించారు. ‘దాబ్రాలో నేను చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ తన అభిప్రాయం చెప్పారు. నేను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో ఇప్పటికే వివరణ ఇచ్చాను. నేను ఎవర్నీ అవమానించాలని అనుకోనపుడు క్షమాపణ ఎందుకు కోరాలి. ఒకవేళ ఎవరైనా అవమానకరంగా భావిస్తే.. నేను ఇదువరకే పశ్చాత్తాపం కూడా ప్రకటించా’అని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. 

కాగా, ఈ ఘటనపై ఇప్పటికే భాజపా మంత్రి ఇమర్తి దేవీ తనపై కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘సోనియా గాంధీ తల్లిలాంటి వారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీలో ఉంచుకోవద్దని నేను ఆమెను కోరుతున్నా. తన కుమార్తెను ఎవరైనా ఇలా దూషిస్తే ఆమె ఊరుకుంటారా?’ అని ప్రశ్నించారు. 

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ దాబ్రా ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా మంత్రి ఇమర్తిదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై భాజపాతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సహా పలువురు నాయకులు రెండు గంటల పాటు మౌనదీక్ష చేపట్టారు. కమల్‌నాథ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందిస్తూ కమల్‌నాథ్‌కు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని