IT Raids: 120 కార్లు..250 మంది సిబ్బంది..సినిమాను తలపించేలా నోట్ల గుట్టలు స్వాధీనం

మహారాష్ట్రలోని పలు సంస్థల నుంచి ఆదాయ పన్నుశాఖ అధికారులు నిన్న రూ.390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేశారు. ఈ భారీ మొత్తంలో నగదు, ఆభరణాల స్వాధీనానికి అధికారులు ముందస్తుగా పగడ్బందీగా ప్రణాళిక రచించారు. ఈ తనిఖీ ప్రక్రియంతా ఒక సినిమా సన్నివేశాన్ని తలపించేలా, ఎవరికి అనుమానం రాకుండా అధికారులు తీర్చిదిద్దారు. 

Updated : 12 Aug 2022 17:56 IST

ముంబయి: మహారాష్ట్రలోని పలు సంస్థల నుంచి ఆదాయ పన్నుశాఖ అధికారులు నిన్న రూ.390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేశారు. ఈ భారీ మొత్తంలో నగదు, ఆభరణాల స్వాధీనానికి అధికారులు ముందస్తుగా పగడ్బందీగా ప్రణాళిక రచించారు. ఈ తనిఖీ ప్రక్రియంతా ఒక సినిమా సన్నివేశాన్ని తలపించేలా, ఎవరికి అనుమానం రాకుండా అధికారులు తీర్చిదిద్దారు.

ఆ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఐటీ అధికారులు రూ.56 కోట్ల విలువైన నగదు, 32 కేజీల బంగారం, రూ.14 కోట్ల విలువైన వజ్రాలు, ఇతర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల నిమిత్తం ఆగస్టు 3న అధికారులు 120 వాహనాలను సిద్ధం చేశారు. వాటిని విడివిడిగా తిప్పారు. వాటిని ఊరేగింపునకు వెళ్లేవాటిగా ముస్తాబు చేశారు. ఇక కొన్ని వాహనాలకు తగిలించిన బోర్డులకు అయితే..‘దుల్హన్‌ హమ్ లే జాయేంగే’ అని రాసిఉండటం గమనార్హం. మామూలుగా పెళ్లి కుమారుడిని తీసుకెళ్లే కార్లపై ఆ లైన్ రాస్తుంటారు. దాంతో సోదాల గురించి ఎవరికి సమాచారం వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. అధికారులైతే పెళ్లి వేడుకులకు వెళ్లేవారిలా సిద్ధమై.. తనిఖీలకు బయలుదేరి వెళ్లారు. ఇలా ముందుస్తు ప్రణాళిక రచించడం ఉపయోగపడిందని, అందువల్లే కోట్ల విలువచేసే ఆభరణాలను గుర్తించగలిగామని చెప్పారు. అలాగే పట్టుబడిన నగదును లెక్కించడానికి 13 గంటలు పట్టిందని చెప్పారు. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన సమాచారాన్ని అందుకొని 250 మంది అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి, ఈ దాడులు చేపట్టారు. 

జాల్నా, ఔరంగాబాద్‌, నాసిక్‌, ముంబయిల్లో ఈ నెల 3న సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ పేర్కొంది. స్టీల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిర్వహించే ఈ సంస్థలు పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు తెలిపింది. అయితే ఆ సంస్థల పేర్లను మాత్రం వెల్లడించలేదు. సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. ఓ సహకార బ్యాంకులో ఆ రెండు సంస్థల యజమానులు, ఉద్యోగుల పేర్లతో ఖాతాలు తెరిచి 30కి పైగా లాకర్లు నిర్వహిస్తున్నారని, వాటిలో కట్టల కొద్దీ నగదు, ఆభరణాలను దాచారని, వాటిని లెక్కల్లో చూపలేదని పేర్కొంది. మరో చోట ఓ ఫాంహౌస్‌లోని రహస్య గదిలోనూ భారీ ఎత్తున నగదు లభ్యమైనట్లు తెలిపింది. దీంతోపాటు వివిధ సంస్థల నుంచి కొనుగోళ్లు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా సంస్థల వ్యయాన్ని అక్రమంగా పెంచి చూపించాయని, జీఎస్టీ మోసాలకూ పాల్పడ్డాయని పేర్కొంది. ఖాతాల్లో నమోదు చేయని రూ.120 కోట్లకుపైగా విలువైన ముడి సరకును గుర్తించినట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని