Parliament: మహిళల భద్రతపై సోషల్‌మీడియా బాధ్యత వహించాలి: కేంద్ర ఐటీ మంత్రి

అంతర్జాలం సహా అన్ని చోట్ల మహిళల భద్రతకు సంబంధించి సోషల్‌మీడియాని బాధ్యత వహించేలా చేయాల్సిన అవసరముందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. మహిళల్ని అమ్మకానికి ఉంచిన ‘బుల్లి బాయ్‌’ యాప్‌పై భాజపా ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ

Published : 04 Feb 2022 22:41 IST

దిల్లీ: అంతర్జాలంలో మహిళల భద్రతకు సంబంధించి సోషల్‌మీడియాని బాధ్యత వహించేలా చూడాల్సిన అవసరముందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. మహిళల్ని అమ్మకానికి ఉంచిన ‘బుల్లీ బాయ్‌’ యాప్‌పై రాజ్యసభలో భాజపా ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానిచ్చారు. 

‘‘సైబర్‌ ప్రపంచంతో సహా ప్రతి చోటా మహిళలను సురక్షితంగా ఉంచేలా మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది. మహిళల భద్రత విషయంలో సోషల్‌మీడియాను బాధ్యత వహించేలా చేయడం ముఖ్యం. అయితే, సోషల్‌మీడియా మార్గదర్శకాలను మరింత బలోపేతం చేయాలని, సైబర్‌ కార్యకాలపాలపై కఠిన చట్టాలను తీసుకురావాలని భాజపా ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతిసారి.. విపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయి. భావప్రకటన స్వేచ్ఛను కేంద్రం హరిస్తోందని ఆందోళన చేస్తున్నాయి’’అని కేంద్రమంత్రి అశ్విని చెప్పుకొచ్చారు.

సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొందరు ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ‘బుల్లీ బాయ్‌’ పేరిట యాప్‌ను సృష్టించి ఏకంగా మహిళల్ని యాప్‌లలో అమ్మకానికి పెట్టి అల్లరిపాలు చేశారు. ఈ విషయాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది గత నెలలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన.. ఆ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలిని పోలీసులు ఉత్తరాఖండ్‌లో అరెస్ట్‌ చేశారు. తొలుత 21ఏళ్ల విశాల్‌ అనే విద్యార్థిని బెంగళూరులో అరెస్ట్‌ చేసిన ముంబయి సైబర్​ పోలీసులు.. అతడిని విచారించగా పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని