ITC: కొవిడ్‌ ‘నేజల్‌ స్ప్రే’ క్లినికల్‌ ట్రయల్స్‌.. ధ్రువీకరించిన ఐటీసీ!

కరోనా కట్టడికి ఆయా ఫార్మాసంస్థలు వ్యాక్సిన్లు, సూది అవసరం లేని టీకాలు రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైరస్‌ నివారణకు ముక్కులో వేసే ‘నేజల్‌ స్ప్రే’ను అభివృద్ధి చేస్తున్నట్లు దేశీయ సంస్థ ‘ఐటీసీ’ వెల్లడించింది. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు...

Published : 25 Nov 2021 19:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా కట్టడికి ఆయా ఫార్మాసంస్థలు వ్యాక్సిన్లు, సూది అవసరం లేని టీకాలు రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైరస్‌ నివారణకు ముక్కులో వేసే ‘నాస్ట్రల్‌ స్ప్రే’ను అభివృద్ధి చేస్తున్నట్లు దేశీయ సంస్థ ‘ఐటీసీ’ వెల్లడించింది. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ధ్రువీకరించింది. ఐటీసీ ప్రతినిధి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌ ఎక్కడ జరుగుతున్నాయి? ఉత్పత్తి ఎక్కడ చేస్తారు? ఏ బ్రాండ్ కింద మార్కెటింగ్‌ జరుగుతుంది? తదితర ప్రశ్నలకు బదులిచ్చేందుకు సైతం ఆయన నిరాకరించారు. అయితే.. అన్ని అనుమతుల లభించాక దీన్ని సావ్‌లాన్‌(Savlon) బ్రాండ్ కింద మార్కెటింగ్‌ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఎల్‌ఎస్‌టీసీలో అభివృద్ధి..

బెంగళూరులోని ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఎల్‌ఎస్‌టీసీ)లో ఈ స్ప్రేను అభివృద్ధి చేశారు. నాసికా కుహరం ప్రవేశ మార్గంలోనే వైరస్‌ను కట్టడి చేసేలా దీన్ని రూపొందించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఎథిక్స్‌ కమిటీల నుంచి అనుమతులు పొందడంతోపాటు క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఇండియా (సీటీఆర్‌ఐ)లోనూ నమోదయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేసిన పరిశుభ్రతా ప్రమాణాలను అందుకోవడంతోపాటు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌, వ్యాప్తిని అరికట్టడంలో ఈ స్ప్రే ప్రభావవంతంగా, సురక్షితంగా పని చేస్తుందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని