Reasi attack: రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే.. స్కెచ్‌ విడుదల చేసిన పోలీసులు

రియాసీ ఉగ్రదాడి ఘటనలో కీలక నిందితుడి స్కెచ్‌ను పోలీసులు తయారుచేశారు. మరోవైపు కథువాలో రెండో ఉగ్రవాది కూడా హతమయ్యాడు.

Published : 12 Jun 2024 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  జమ్మూకశ్మీర్‌లో రియాసీ వద్ద యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఘటన దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ప్రధాన నిందితుడి ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడిస్తే రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. వారు అందజేసిన వివరాల ఆధారంగా ఓ స్కెచ్‌ను తయారుచేయించారు. 

‘‘రియాసీ వద్ద బస్సుపై జరిగిన ఉగ్ర దాడిలో నిందితుడి సమాచారం అందిస్తే.. వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తాం’’ అని పోలీసుశాఖ ప్రతినిధి పీటీఐకు వెల్లడించారు. గత ఆదివారం శివ్‌ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ వాహనంలో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. దీనిపై ఉగ్రమూక కాల్పులు జరపడంతో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. 

ఈ దాడి తర్వాత దోడా, కథువా జిల్లాల్లో వరుసగా ఉగ్ర ఘటనలు చోటుచేసుకొన్నాయి. నేటి ఉదయం కథువాలో జరుగుతున్న జాయింట్‌ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడుల్లో పాల్గొన్నవారు సుదీర్ఘకాలంగా జమ్మూకశ్మీర్‌లోనే ఉంటున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. తాజాగా మృతి చెందిన ఉగ్రవాది బ్యాగ్‌ నుంచి రూ.లక్ష నగదును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. భారీ సంఖ్యలో తూటాలు, గ్రనేడ్లు, ఎండు పప్పులు, రొట్టెలు, ఔషధాలు, ఇంజెక్షన్లు, పెయిన్‌ కిల్లర్లు, రెండు ఏ4 బ్యాటరీలు, ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఉగ్రవాదులు గ్రామంలో మంచినీరు కోసం ఇంటింటికీ వెళ్లడంతో సమాచారం భద్రతా దళాలకు చేరింది. నిన్న రాత్రి  8 గంటలకు ఎన్‌కౌంటర్‌ మొదలైంది. దీనిలో కొందరు స్థానికులు కూడా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ కారణంగా తొలుత భయపడ్డ స్థానికులు.. నేటి ఉదయం నుంచి భయం వీడి ఇళ్ల బయటకు వచ్చి భద్రతా దళాలకు సాయం చేస్తున్నారు. 

కథువాలో నిన్న రాత్రి ఎన్‌కౌంటర్‌ మొదలుకాగానే.. అక్కడికి సుదూరంగా ఉన్న దోడా వద్ద పాక్‌ సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఇప్పటివరకు ఓ జవాన్‌ సహా ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మరణించినట్లైంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని