Updated : 06 Aug 2022 22:05 IST

Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం

దిల్లీ: ఊహించినట్లుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో(Vice President Election) అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా(Margaret Alva)పై 346 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. ధన్‌ఖడ్‌కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంతకుముందు పార్లమెంటు భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించారు. ఉప రాష్ట్రపతిగా ఆయన ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. ధన్‌ఖడ్‌ గెలుపుతో భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

అనుహ్యంగా బరిలోకి..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేర్లలో తొలుత జగ్‌దీప్‌ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడినే మరోసారి కొనసాగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌లలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. వీరెవరినీ కాకుండా జగ్‌దీప్‌ పేరును భాజపా అధిష్ఠానం ఖరారు చేయడం గమనార్హం. ఇలా అనూహ్యంగా బరిలో నిలిచినప్పటికీ.. విజయం మాత్రం నల్లేరుపై నడకే అయ్యింది.

ఎంపీగా.. ఎమ్మెల్యేగా..

1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో జగ్‌దీప్‌ జన్మించారు. గోఖల్‌ చంద్‌, కేసరి దేవి తల్లిదండ్రులు. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 1990లో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. 1993-98 మధ్య అజ్‌మేర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2019 నుంచి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. మమత ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని