Ind vs pak: 50ఏళ్ల నాటి ఆ ఫొటో వెనుక.. ఓ పెద్ద మైండ్‌గేమ్‌..!

బంగ్లాదేశ్‌ యుద్ధానికి ఓ ప్రత్యేకత ఉంది.. భారత్‌ దౌత్యనీతితో చైనా, అమెరికా, పాక్‌ మూడిటి నోరు ఒకేసారి మూయించింది. అంతేకాదు, అమెరికా ఏమిచేయాలో తెలియనిస్థితికి జారిపోయింది.

Published : 17 Dec 2021 01:39 IST

 మానసికంగా బెదిరిపోయిన పాక్‌ సైనిక జనరల్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బంగ్లాదేశ్‌ యుద్ధానికి ఓ ప్రత్యేకత ఉంది.. భారత్‌ దౌత్యనీతితో చైనా, అమెరికా, పాక్‌ మూడింటి నోరు ఒకేసారి మూయించింది. అంతేకాదు, అమెరికా ఏమిచేయాలో తెలియనిస్థితికి జారిపోయింది. చూస్తుండగానే దాని మిత్రదేశం పాకిస్థాన్‌ రెండు ముక్కలైంది. ఈ విజయం అయాచితంగా వచ్చింది కాదు. భారత్‌ దాదాపు ఏడాదిపాటు ప్రణాళిక రచించి..  తగిన దౌత్యనీతిని అనుసరించి.. చేపట్టిన సైనిక చర్య ఫలితంగా బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భవించి సరిగ్గా నేటికి 50 ఏళ్లు నిండాయి. బంగ్లా యుద్ధంలో చివరి రోజైన డిసెంబర్‌ 16వ తేదీన పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. పాక్‌ సైనిక జనరల్స్‌ను భారత సైనికాధికారులు కేవలం మైండ్‌గేమ్‌తో లొంగదీసుకోవడం విశేషం.

డిసెంబర్‌ 3వ తేదీన ‘ఆపరేషన్‌ ఛెంఘిజ్‌ఖాన్‌’ పేరిట పాక్‌ యుద్ధం మొదలుపెట్టగా భారత్‌ ఆపరేషన్‌ ట్రైడెంట్‌తో దానిని చావుదెబ్బతీసింది. రష్యాతో ఉన్న ‘ట్రీటీ ఆఫ్‌ ఫ్రెండ్ షిప్‌ అండ్‌ కోఆపరేషన్‌’ ఒప్పందాన్ని వాడుకొని అమెరికా, బ్రిటన్‌ నావికాదళాలు యుద్ధంలోకి చొరబడకుండా చూసుకొంటూనే.. తంగైల్‌ పారాడ్రాప్‌తో తుది అంకానికి శ్రీకారం చుట్టుంది.    

తంగైల్‌ పారాడ్రాప్‌.. తర్వాత పెద్ద మైండ్‌ గేమ్‌..!

డిసెంబర్‌ 11న చీకట్లు ముసరగానే భారత్‌లోని కలైకొండ, డమ్‌డమ్‌ వైమానిక స్థావరాల నుంచి 50 విమానాల దండు బంగ్లాదేశ్‌ మధ్యలో ఉన్న తంగైల్‌ వైపుగా వెళ్లాయి. ఆయుధాలు, ఇతర సాధన సంపత్తితో భారత్‌కు చెందిన రెండు బెటాలియన్ల పారా కమాండోలు నేలపైకి దిగారు. మరికొన్ని చోట్ల ఖాళీ పారాచూట్లను జారవిడిచారు. భారత కమాండోలు జమునా నదిపైన ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన పుంగిలి వంతెనను స్వాధీనం చేసుకొన్నారు. స్థానికులు భారత సైన్యానికి అండగా ఉన్నారు. దీంతో పాకిస్థాన్‌  93వ బ్రిగేడ్‌  ఢాకా వైపు వెళ్లేందుకు మార్గం మూసుకుపోయింది. ఇక్కడ 24 గంటల పాటు జరిగిన పోరులో 350 పాకిస్థానీ సైనికులు చనిపోయారు. భారత దళాలు డిసెంబర్‌ 16 నాటికి ఢాకా వద్దకు చేరుకొన్నాయి. పాకిస్థాన్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజి(అమిర్‌ అబ్దుల్లాఖాన్‌ నియాజీ) లొంగి పోవడానికి భారత్‌ ఉదయం 9 గంటల వరకు సమయం ఇచ్చింది. కానీ, పాక్‌ వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. దీంతో భారత మేజర్‌ జనరల్‌ గంధర్వ నాగ్ర ఓ సందేశంతో ఇద్దరు అధికారులను నియాజీ వద్దకు పంపారు. ‘‘డియర్‌ అబ్దుల్లా, నేను ఢాకా చేరుకొన్నాను. ఇక ఆట ముగిసింది. నేను చెప్పే సలహా ఏమిటంటే నువ్వు లొంగిపో. నిన్ను సురక్షితంగా చూసుకొంటాను’’ అని దానిలో ఉంది. సందేశం తీసుకెళ్లిన అధికారులు తిరిగి వచ్చేటప్పుడు పాక్‌ మేజర్‌ జనరల్‌ జంషేద్‌ను కూడా తమతోపాటు తీసుకొచ్చారు. ఏఏకే నియాజీ లొంగిపోవడానికి అంగీకరించినట్లు తెలిపారు. దీంతో కాల్పుల విరమణ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. జనరల్‌ నాగ్ర స్వయంగా నియాజీ వద్దకు వెళ్లారు. అప్పటికే ఏఏకే నియాజీ మానసికంగా కుంగిపోయి కనిపించారు. నాగ్రను చూసిన ఆయన ఒక్కసారిగా కన్నీటి పర్యంతమై ‘‘పిండి(పాక్‌ సైనిక ప్రధానకార్యాలయం ఉన్న రావల్పిండి)లో ఉన్న ద్రోహులు మమ్మల్ని చంపేశారు’’ అని వాపోయారు.

‘లొంగుబాటు పత్రం’పై హైడ్రామా..!

ఆ రోజు మధ్యాహ్నమే నిపుణులతో రాయించిన ఓ ‘లొంగుబాటు పత్రం’ తీసుకొని భారత మేజర్‌ జనరల్‌ జాకబ్‌ ఢాకా చేరుకొన్నారు. ఆయనకు ఓ పాకిస్థానీ బ్రిగేడియర్‌, ఇద్దరు ఐరాస ప్రతినిధులు అక్కడ ఆయనకు స్వాగతం పలికారు. నేరుగా వారు ఢాకాలో ఏఏకే నియాజీ ఉన్న సైనిక ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నియాజీతో పాటు ఫర్మాన్‌ అలీ అనే సైనికాధికారి ఉన్నారు. మేజర్‌ జనరల్‌ జాకబ్‌ ఆ లొంగుబాటు పత్రంలోని వివరాలను చదివి వినిపించారు. కానీ, చివరి ప్రయత్నం చేద్దామని చూసిన ఏఏకే నియాజీ తెలివితేటలు చూపించబోయారు. ‘‘నేను లొంగిపోతున్నానని ఎవరు చెప్పారు. కాల్పుల విరమణ, దళాల ఉపసంహరణపై చర్చించేందుకు రమ్మని చెప్పాను’’ అంటూ ప్లేటు ఫిరాయించాడు. దీంతో నియాజీ మానసిక పరిస్థితి అర్థం చేసుకొన్న జాకబ్‌ అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేదు. దీంతో జాకబ్‌ కఠిన వైఖరి అవలంభించారు. ‘‘మీరు లొంగిపోతే.. జెనీవా ఒప్పందం ప్రకారం గౌరవంగా చూసుకొంటాము. మీరు దానికి అంగీకరించకపోతే ఆ తర్వాత పరిణామాలకు నాది బాధ్యత కాదు. మీకు 30 నిమిషాల సమయం ఇస్తున్నాం. మీరు తిరస్కరిస్తే యుద్ధం కొనసాగుతుంది. ఢాకాపై బాంబింగ్‌ మొదలవుతుంది’’ అని జాకబ్‌ చెప్పారు. అనంతరం నియాజీ సమాధానం కోసం చూడకుండా ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశారు. నియాజీని హెచ్చరించే క్రమంలో జాకబ్‌ లోపల ఎంత ఆందోళన చెందుతున్నా.. ఎక్కడా తొణక్కుండా చాలా ఆత్మవిశ్వాసంగా కనిపించారు.  

అర్ధగంట తర్వాత.. షరతులు విధించి లొంగదీసుకొని..

అర్ధగంట తర్వాత జనరల్‌ నియాజీ ఉన్న గదిలోకి అడుగుపెట్టారు మేజర్‌ జనరల్‌ జాకబ్‌. ‘లొంగిపోతున్నారా..?’ అని జాకబ్‌ రెండుసార్లు ప్రశ్నించారు. నియాజీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. మూడోసారి అడగడం పూర్తి అయ్యాక.. ‘మీ మౌనం అంగీకారంగా భావిస్తున్నాను’ అని జాకబ్‌ చెప్పారు. ఆ మాటతో నియాజీకి ఏమీ అర్థం కాలేదు. అదే సమయంలో లొంగుబాటుపత్రంపై సంతకాలు చేసేందుకు రేస్‌కోర్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు జాకబ్‌ వెల్లడించారు. ఆ సమయంలో నియాజీ వద్ద ఉన్న ‘ఖడ్గాన్ని’ అప్పగించాలని సూచించారు. వాస్తవానికి నియాజీ వద్ద ఎటువంటి ఖడ్గం లేకపోవంతో రివాల్వర్‌ను అప్పగించేందుకు అంగీకరించారు. అందరి ఎదుటా లొంగుబాటు పత్రంపై సంతకాలు చేయమనడం మాత్రం పాక్‌ జనరల్‌లను ఇబ్బంది పెట్టింది. దీనికి తోడు భారత ఈస్టర్న్‌ కమాండ్‌ జీవోసీ అరోడాకు గౌరవ వందనం కూడా సమర్పించాలని పాక్‌ సైనిక జనరల్‌కు షరతు విధించారు. కానీ, గౌరవ వందనం ఇచ్చేందుకు సిబ్బంది లేరని నియాజీ వెల్లడించారు. దీంతో పాక్‌ జనరల్‌కు ఉన్న ఏడీసీ (ఎయిడ్‌ డే క్యాంప్‌)ను దీనికి పురమాయించాలని జనరల్‌ జాకబ్‌ సూచించారు.

సతీసమేతంగా లెఫ్టినెంట్‌ జనరల్‌ జగజ్జీత్‌ సింగ్‌ అరోడా..!

16వ తేదీ ఉదయమే భారత ఆర్మీచీఫ్‌ జనరల్‌ శామ్‌ మానిక్‌షాకి ఢాకాలో పరిస్థితి అర్థమైపోయింది. ఆయన ఈస్టర్న్‌ కమాండ్‌ జీవోసీ-ఇన్‌-సి జగజ్జీత్‌ సింగ్‌కు ఉదయమే ఫోన్‌ చేసి ఢాకా వెళ్లి పాక్‌ సేనల లొంగుబాటు కార్యక్రమాన్ని చూసుకోవాలని పురమాయించారు. ఈ కార్యక్రమానికి అరోడా సతీమణీ బంటీ అరోడా కూడా హాజరయ్యారు. అనిశ్చితి నెలకొన్న సమయంలో ఆమె ఢాకాకు వెళ్లడం రిస్క్‌తో కూడుకొన్న పనే. సాయంత్రం నాలుగున్నర సమయంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ అరోడా సతీసమేతంగా ఢాకా చేరుకొన్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.55 నిమిషాలకు లొంగుబాటు పత్రంపై పాక్‌ జనరల్‌ నియాజీ సంతకాలు చేశారు. వాస్తవానికి ఆ పత్రంలో 4.31కి సంతకాలు చేయాలని ఉంది. కానీ రెండు వారాల తర్వాత కోల్‌కతాలో మరోసారి లొంగుబాటు పత్రంపై ఇరుపక్షాలు సంతకాలు చేయడం విశేషం. తొలిసారి సంతకాలు చేసిన  పత్రంలో లోపాలు ఉండటంతో ఈ విధంగా చేశారు.

కొసమెరుపు..!

టైమ్స్‌ లండన్‌లో ప్రచురించిన తంగైల్‌ ఎయిర్‌డ్రాప్‌ చిత్రం తమ మనోబలాన్ని దెబ్బతీసిందని ఆ తర్వాత ఏఏకే నియాజీ స్వయంగా అంగీకరించారు. దీనిని చూస్తే బ్రిగేడ్‌ (3వేల నుంచి 5 వేల లోపు) మొత్తం ఢాకాలో దిగినట్లు అనిపించేట్లు ఉందని పేర్కొన్నాడు. కానీ, భారత్‌ ఒక బెటాలియన్‌ దాదాపు 700 నుంచి 1000లోపు సైనికులను మాత్రమే ఎయిర్‌డ్రాప్‌ చేసింది..! మిగిలిన చోట్ల కేవలం పారాచూట్లను మాత్రం నేలపైకి వదిలారు. వాస్తవానికి అంతకుముందు ఆగ్రాలో భారత పారా సైనికులు చేసిన విన్యాసాల ఫొటోలను తంగైల్‌ ఎయిర్‌ డ్రాప్‌గా భారత్‌ పాశ్చాత్యమీడియాకు చూపింది. అవి పాక్‌ జనరల్స్‌ మానసికస్థైర్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు