Sukesh- Jacqueline: జైలు నుంచి జాక్వెలిన్‌కు హోలీ సందేశం..!

Sukesh Chandrashekhar- Jacqueline Fernandez: ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నుంచి ఉద్దేశించి రాసిన హోలీ సందేశం వైరల్‌గా మారింది.

Updated : 07 Mar 2023 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జైల్లో కూర్చొని తాపీగా ఫోన్ల సాయంతో రూ.200 కోట్లు మోసం చేసిన నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌(Sukesh Chandrashekhar) తన సన్నిహితురాలు, సినీ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌(Jacqueline Fernandez)కు హోలీ సందేశం పంపాడు. అతడు స్వదస్తూరీతో ఈ సందేశాన్ని రాశాడు. తన వాదన వినిపించినందుకు మీడియాకు ధన్యవాదాలు కూడా తెలిపాడు. ఈ లేఖలో ఓ పేరా మొత్తం జాక్వెలిన్‌ గురించి రాసుకొచ్చాడు. ఆమె కోసం ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చాడు. ‘‘నా దృష్టిలో ఎప్పటికీ అందగత్తె అయిన జాక్వెలిన్‌కు హోలీ శుభాకాంక్షలు. నీ జీవితంలో దూరమైన రంగులును తిరిగి 100 రెట్లు తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ ఈ లేఖ సాగింది. ఇప్పుడు ఈ లేఖ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇటీవల దిల్లీలోని మండోలీ జైల్లో సుఖేశ్‌ ఉంటున్న గదిపై అధికారులు రైడ్‌ చేశారు. అక్కడ లక్షల రూపాయల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా సుఖేశ్‌ కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

మరోవైపు ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గత నెలలో వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్‌ను జీవనోపాధిని నాశనం చేశాడని న్యాయస్థానం ఎదుట వాగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా సుఖేశ్‌ తనను తాను జాక్వెలిన్‌కు పరిచయం చేసుకొన్నాడు.

సుఖేశ్‌ 2020 జూన్‌ నుంచి మే 2021 వరకు మొబైల్‌ ఫోన్లు, వాయిస్‌ మాడ్యూలర్లు వినియోగిస్తూ ర్యాన్‌బ్యాక్సి మాజీ యజమాని శివీందర్‌ సింగ్‌ భార్య అధితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకొన్నాడు. ఆమె భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని రూ.200 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ డబ్బు చెల్లించేందుకు ఆ కుటుంబం అప్పులు కూడా చేసింది. ఎన్నాళ్లకు బెయిల్‌ రాకపోవడంతో అధితికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని