Instagram: ఇన్‌స్టాలో బగ్‌ పట్టి.. రూ.38 లక్షలు రివార్డు కొట్టేశాడు!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)’లో ఓ బగ్‌(Bug)ను కనిపెట్టిన ఓ యువకుడు.. సంస్థ నుంచి రూ.38.5 లక్షల పారితోషికం పొందాడు. తమ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే వినియోగదారులు....

Updated : 20 Sep 2022 08:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)’లో ఓ బగ్‌(Bug)ను కనిపెట్టిన యువకుడు.. ఆ సంస్థ నుంచి ఏకంగా రూ.38.5 లక్షల పారితోషికం పొందాడు. ఇతర యూజర్‌ల లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే ఏ ఇన్‌స్టా ఖాతా నుంచైనా.. వారి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌(Reels)కు చెందిన థంబ్‌నెయిల్‌(Thumbnail)ను మార్చేందుకు వీలు కల్పించే బగ్‌ను అతను కనుగొన్నాడు. దీంతో.. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు.. వినియోగదారుల రీల్స్‌ థంబ్‌నెయిల్స్‌ విషయంలో వారి ప్రమేయం లేకుండానే మార్పులు చేసే అవకాశాన్ని అడ్డుకున్నట్లయింది.

రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన నీరజ్‌ శర్మ ఈ ఏడాది జనవరిలోనే తన అకౌంట్‌లో ఈ బగ్‌ను గుర్తించాడు. దీనిపై ‘ఫేస్‌బుక్‌’కు రిపోర్టు చేశాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు.. ఈ లోపానికి సంబంధించిన డెమో ఇవ్వాలని అడిగారు. ఈ క్రమంలోనే లాగిన్‌ వివరాలు అవసరం లేకుండానే ఇతరుల ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ థంబ్‌నెయిల్‌ను మార్చి చూపుతూ.. ఓ 5 నిమిషాల డెమోను శర్మ సంస్థకు పంపాడు. అనంతరం దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన సంస్థ.. మే నెలలో ఈ లోపాన్ని అంగీకరించింది. ఈ క్రమంలోనే శర్మకు 45 వేల డాలర్ల(రూ.35 లక్షలు) రివార్డు అందజేసింది. దీంతోపాటు రివార్డు అందజేయడంలో నాలుగు నెలల ఆలస్యానికిగానూ మరో 4500 డాలర్లు(రూ.3.5 లక్షలు) అదనంగా ప్రకటించింది.

‘ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ బగ్‌ ద్వారా.. ఎవరి రీల్ థంబ్‌నెయిల్‌ అయినా సరే.. వేరే ఇతర అకౌంట్ల నుంచీ మార్చొచ్చు. సంబంధిత యూజర్‌ పాస్‌వర్డ్ ఎంత బలంగా ఉన్నా సరే.. కేవలం వారి అకౌంట్‌కు సంబంధించిన మీడియా ఐడీ సాయంతో ఈ పని చేయొచ్చు. గతేడాది డిసెంబర్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ లోపాన్ని వెతకడం మొదలుపెట్టా. జనవరి 31న బగ్ గుర్తించా. దీనిపై ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ పంపా. మూడు రోజుల తర్వాత వారి నుంచి సమాధానం వచ్చింది. వారు కోరినట్లుగానే డెమో పంపా’ అని శర్మ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల భద్రతను ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకుగాను ‘మెటా’ సంస్థ ప్రోగ్రామర్ల కోసం ప్రత్యక్షంగా ‘మెటా బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌’ను నిర్వహిస్తుంది. మెటా సాంకేతికతలు, ప్రోగ్రామ్‌లలో భద్రతాపరమైన లోపాలను గుర్తించిన ప్రోగ్రామర్లు, పరిశోధకులకూ భారీగా రివార్డులు అందజేస్తుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని