Jairam Ramesh: కార్పొరేట్‌ గుత్తాధిపత్యాన్ని సృష్టించొద్దు

దేశంలోని కార్పొరేట్‌ సంస్థల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, ఒకరినొకరు అణచివేసుకునే ధోరణితో అది సాగకూడదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సూచించారు. ఈ తరహా పోటీ కార్పొరేట్‌ గుత్తాధిపత్యానికి దారితీయకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Published : 16 Jun 2024 05:56 IST

వ్యాపార సంస్థల విలీనం న్యాయబద్ధంగా ఉండాలి
కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ సూచన

దిల్లీ: దేశంలోని కార్పొరేట్‌ సంస్థల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, ఒకరినొకరు అణచివేసుకునే ధోరణితో అది సాగకూడదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సూచించారు. ఈ తరహా పోటీ కార్పొరేట్‌ గుత్తాధిపత్యానికి దారితీయకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థల విలీనం న్యాయబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా ఉండాలని తెలిపారు. అధికారంలో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధం గల కార్పొరేట్‌ యాజమాన్యాలు అనుచిత లబ్ధిపొందకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. దక్షిణ భారత్‌లో సిమెంట్‌ రంగంలో తన వాటాను విస్తరించుకునే లక్ష్యంలో భాగంగా అదానీ గ్రూప్‌....పెన్నా సిమెంట్స్‌ను కొనుగోలు చేయనుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో జైరాం రమేశ్‌ ఈ విషయాలను పోస్ట్‌ చేశారు. ‘దేశంలో అతిపెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారుగా నిలవటానికి గాను 2022 సెప్టెంబరులో అంబుజా సిమెంట్స్, ఏసీసీని కొనుగోలు చేసింది. ఒకేచోట అతిపెద్ద సిమెంట్‌ కర్మాగారం కలిగి ఉన్న సంఘీ ఇండస్ట్రీస్‌ను 2023 ఆగస్టులో విలీనం చేసుకుంది. దక్షిణాది మార్కెట్‌లో అగ్రస్థాయి వాటాను అందుకోవడానికి 2024లో పెన్నా సిమెంట్స్‌ను విలీనం చేసుకోబోతోంది’ అంటూ అదానీ గ్రూప్‌ టేకోవర్‌ క్రమాన్ని జైరాం రమేశ్‌ వివరించారు. త్వరలో మరికొన్ని సిమెంట్‌ కంపెనీలను కూడా అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయనుందని తెలిపారు. 40 రంగాల్లో గుత్తాధిపత్యాన్ని సాధించే దిశగా అదానీ గ్రూప్‌ సహా అయిదు కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు అడుగులేస్తున్నాయని ఓ ఆర్థికవేత్తను ఉటంకిస్తూ జైరాం రమేశ్‌ తెలిపారు. 2015లో సగటు భారతీయుడు వివిధ సరకుల కొనుగోలుకు రూ.100 వెచ్చిస్తే అందులో రూ.18 లాభంగా వ్యాపార నిర్వహణ యజమానులకు వెళ్లేదని, 2021నాటికి ఆ లాభం మొత్తం రూ.36కి చేరిందని రమేశ్‌ వెల్లడించారు. ‘వ్యాపార సంస్థలు, కంపెనీలు వృద్ధి చెందాలి. అదే సమయంలో ఒకరినొకరు అణచివేసుకుని, గుత్తాధిపత్యానికి దారితీసేలా పోటీపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని