Jaishankar: శ్రీలంక పరిస్థితులపై కేంద్రమంత్రి జై శంకర్ కలవరం..!

ప్రజల కనీస అవసరాల తీర్చలేక ద్వీపదేశం శ్రీలంక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. చివరకు ఔషధాల కొరత కారణంగా వైద్యం కూడా అందించలేని స్థితిలో ఉండిపోయింది.

Published : 30 Mar 2022 01:40 IST

దిల్లీ: ప్రజల కనీస అవసరాల తీర్చలేక ద్వీపదేశం శ్రీలంక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. చివరకు ఔషధాల కొరత కారణంగా వైద్యం కూడా అందించలేని స్థితిలో ఉండిపోయింది. ఈ పరిస్థితి గురించి తెలుసుకున్న భారత్ వెంటనే స్పందించింది. ‘ఔషధాల కొరత కారణంగా పెరడెనియా ఆసుపత్రిలో ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలను నిలిపివేశారు. అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే నిర్వహిస్తున్నారు’ అంటూ శ్రీలంకకు చెందిన ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. EconomicCrisisLK అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అందుకు జై శంకర్ ట్విటర్ వేదిగా స్పందించారు. ‘ ఈ వార్త నన్ను కలచివేసింది. ఈ విషయంలో భారత్ ఎలా సహకరించగలదో అడిగి తెలుసుకోమని భారత రాయబారిని ఆదేశించాను’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే NeighbourhoodFirst అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి, పొరుగుదేశాన్ని ఆదుకోవడంలో ముందుంటామని సూచన ఇచ్చారు.

ప్రస్తుతం కేంద్రమంత్రి శ్రీలంకలో పర్యటిస్తున్నారు. బిమ్స్‌టెక్ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడి భారత రాయబారికి సూచనలు చేశారు. అలాగే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఒక బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్లు భారత్‌ ఇదివరకే ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని