Oil price: చమురు ధరలు మా వెన్ను విరిచేస్తున్నాయ్‌: జైశంకర్‌

పెరుగుతున్న చమురు ధరలు భారత్‌ వెన్ను విరిచేస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు. భారత్‌ 2 వేల డాలర్ల తలసరి ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ చమురు ధరలు శరాఘాతంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు...

Published : 28 Sep 2022 01:28 IST

వాషింగ్టన్‌:  జీ7 దేశాలు ప్రతిపాదించిన రష్యా చమురు ధరలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న చమురు ధరలు భారత్‌ వెన్ను విరిచేస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు. భారత్‌ 2 వేల డాలర్ల తలసరి ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ చమురు ధరలు శరాఘాతంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌ అమెరికా సెక్రెటరీ ఆంటోని బ్లింకెన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రానున్న రోజుల్లో ఇంధన అవసరాలను ఎలా తీర్చుకోవాలన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇది ఎవరికీ ప్రయోజనం కలిగించదని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమమని అన్నారు. మరోవైపు చమురు ధరల అంశంలో యూరోపియన్ యూనియన్‌ సభ్య దేశాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిష్కరించేందుకు జీ7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తూ.. ఆ దేశపు ఆదాయాన్ని పరిమితం చేయాలని భావిస్తున్నాయి. దీని ప్రభావం రష్యా నుంచి అధికశాతం చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై పడనుంది.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయించడాన్ని సోమవారం జై శంకర్‌ తప్పుబట్టిన విషయం తెలిసిందే. బ్లింకెన్‌ తాజా సమావేశంలో బ్లింకెన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన కార్యక్రమం కాదని, గతం నుంచి కొనసాగుతోందని వివరణ ఇచ్చారు.‘‘ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పాక్‌కు విక్రయించడం కొత్త అంశం కాదు. గతం నుంచి కొనసాగుతూ వస్తోంది. మేం ఎవరికి సైనిక సామగ్రి అందజేసినా, దానిని నిర్వహించడం, కొనసాగించడం పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తాం.’’ అని బ్లింకెన్‌ అన్నారు. పాకిస్థాన్‌కు 450 మిలియన్‌ డాలర్ల భారీ భద్రతా సహాయం అందిస్తూ జో బైడెన్‌ సర్కారు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ దేశానికి ఎఫ్‌16 యుద్ధ విమానాలను విక్రయించనుంది. అయితే ఈ నిర్ణయంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల వచ్చే ఉపద్రవాలను ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.  

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts