దిల్లీలో నీటి ఎద్దడి.. జల్‌ బోర్డ్‌ కార్యాలయంపై దాడి

Delhi Water Crisis: దిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఆప్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు దిల్లీ నీటి సరఫరా కార్యాలయంపై దాడికి దిగారు.

Published : 16 Jun 2024 21:24 IST

దిల్లీ: దేశరాజధానిలో నెలకొన్న నీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. మరో వైపు ఆప్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలుపుతూ దిల్లీ నీటి సరఫరా కార్యాలయం(డీజెబీ)పై దాడికి దిగారు.  ఈ ఘటనే భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

నిరసనకారులు మట్టి కుండలతో (మట్కా-ఫోడ్) ఆందోళనకు దిగారు. నగరంలోని నీటి ఎద్దడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపై దాడికి దిగారు. కిటికీలు ధ్వంసం చేశారు. ‘‘ప్రజలు కోపంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలరు. ప్రజలను నియంత్రించిన భాజపా కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఇది ప్రజా ఆస్తి. ఈ ఆస్తిని పాడు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు’’ అని భాజపా మాజీ ఎంపీ రమేష్‌ బిధూరీ అన్నారు. ఆస్తులను ధ్వంసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిమయమైంది. అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకు ఆప్‌ ప్రయత్నిస్తోంది. దిల్లీ నీటి సరఫరా కార్యాలయంలో ఎలాంటి ఆడిట్‌ జరగలేదు. రూ.70,000 కోట్ల నష్టంలో ఉంది’’ అని బిధూరీ ఆరోపించారు. ఈశాన్య దిల్లీకి చెందిన భాజపా ఎంపీ మనోజ్ తివారీ దిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ‘మట్కా-ఫోడ్’ నిరసనలో పాల్గొన్నారు. ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ‘‘ఏటా నీటి సంక్షోభం ఎదురవుతోంది. అతిశీ ఎవరిని మోసం చేస్తున్నారు? గడచిన 10 ఏళ్లలో ఏ పైపులు మార్చారో శ్వేతపత్రం రూపొందించాలి. దిల్లీకి కావాల్సింది సమస్యలను పరిష్కరించేవారు, సాకులు చెప్పేవారిని కాదు” అని తివారీ అన్నారు. మరోవైపు ద్వారకాలో నీటి కోసం స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిస్థితి నీటి సంక్షోభం తీవ్రతకు అద్ధం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని