Jammu And Kashmir: ఉద్యోగం పోలీసు శాఖలో.. విధులు ఉగ్రవాదంలో..!

ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ డీఎస్పీని జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు సదరు అధికారి ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. ఇక, ట్విటర్‌లోనూ ఇతడో సెలబ్రిటి.. ఏకంగా 44వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. 

Published : 22 Sep 2023 12:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం. ఇదేదో చిన్నా చితకా ఉద్యోగి వ్యవహారం కాదు.. ఏకంగా ఓ డీఎస్పీ నిర్వాకం. జమ్మూకశ్మీర్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్‌ ఆదిల్‌ ముస్తాక్‌.. ఉగ్ర ఆపరేటీవ్‌లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని దీనిలో ఇరికించాలని యత్నించాడు. తాజాగా ముస్తాక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని శ్రీనగర్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి ఆరు రోజుల కస్టడీకి తీసుకొన్నారు. 

ఉగ్రవాదిని ఇంటరాగేట్‌ చేస్తే బయటపడింది..

జులైలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి ఫోన్‌ను విశ్లేషించారు. అనంతరం సదరు ఉగ్రవాదిని విచారించగా.. డీఎస్పీ ఆదిల్‌ ముస్తాక్‌తో తాను నిరంతరం టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. చట్టం కన్ను గప్పడంలో అతడు తనకు సాయం చేసినట్లు ఉగ్రవాది వెల్లడించాడు. 

టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ముస్తాక్‌ ఉగ్రవాదితో మాట్లాడటం, మెసేజ్‌లు చేయడం వంటివి చేసినట్లు సీనియర్‌ అధికారులు గుర్తించారు. ‘‘డీఎస్పీకి ఉగ్రవాదికి మధ్య 40 ఫోన్‌కాల్‌ సంభాషణలు జరిగాయి. అరెస్టును తప్పించుకోవడం, న్యాయసాయం పొందడంపై డీఎస్పీ అతడికి సలహాలు ఇస్తున్నాడు’’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్‌ అధికారి వెల్లడించారు.

దర్యాప్తు అధికారులనే ఇరికించేందుకు..

సదరు డీఎస్పీకి వ్యతిరేకంగా టెక్నికల్‌ సాక్ష్యాలతోపాటు నగదు ఎలా అతడి వద్దకు చేరిందనే అంశాలను కూడా సేకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఉగ్ర నగదు సేకరణపై దర్యాప్తు చేస్తున్న అధికారినే కేసులో ఇరికించాలని ఆదిల్‌ యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘ ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ముజ్మిల్‌ జహూర్‌ అనే వ్యక్తి కీలకమని గుర్తించి వేట మొదలుపెట్టారు. మరో వైపు అరెస్టు అయిన వారిలో ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌పై అవినీతి ఆరోపణలు చేసినట్లు ఆదిల్‌ ఓ ఫిర్యాదును సృష్టించాడు’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. 

కెనడాపై కఠిన వైఖరి

లష్కరే తొయిబాకు నిధులు సేకరించే ముజ్మిల్‌ జహూర్‌తో డీఎస్పీ ఆదిల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిని ఆదిల్‌ అరెస్టు నుంచి తప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఉగ్రవాదుల నుంచి డీఎస్పీ రూ.5లక్షలు సొమ్ము తీసుకొన్నట్లు తేలింది. దర్యాప్తు అధికారులపైనే ఉగ్రవాదులు ఆరోపించినట్లు తప్పుడు ఫిర్యాదులను కూడా ఆదిల్‌ సృష్టించాడు. జులైలో ముజ్మిల్‌ను పోలీసులు అరెస్టు చేయటంతో అతడు విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌లో బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆదిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతడి బాధితులు క్రమంగా పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నిందితుడు ఆదిల్‌ ట్విటర్‌లో చాలా చురుగ్గా ఉన్నాడు. అతడికి ఏకంగా 44 వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని