Gujarat Conman: ప్రధాని కార్యాలయ అధికారినంటూ హడావుడి చేసి.. పోలీసులకు చిక్కి..!

పీఎంవోకు చెందిన ఉన్నతాధికారినంటూ జమ్మూకశ్మీర్(Jammu and Kashmir ) అధికారులను మోసగించిన గుజరాత్‌ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటవెంటనే చేసిన పర్యటనలే అతడు పోలీసులకు చిక్కేలా చేశాయి.

Published : 17 Mar 2023 13:43 IST

శ్రీనగర్: తాను ప్రధానమంత్రి కార్యాలయ(PMO) అధికారినంటూ గుజరాత్‌(Gujarat)కు చెందిన ఓ వ్యక్తి జమ్మూకశ్మీర్ యంత్రాంగాన్ని మాయచేశాడు. అక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించాడు. ఫైవ్‌స్టార్ వసతి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జడ్‌ ప్లస్‌ భద్రతతో హల్‌చల్ చేశాడు. సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో పర్యటించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 

జమ్మూకశ్మీర్(Jammu and Kashmir ) పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి పేరు కిరణ్‌ భాయ్‌ పటేల్.  పీఎంఓ (PMO)లో అడిషనల్ డైరెక్టర్‌ అని తనను తాను జమ్మూకశ్మీర్‌ అధికారులకు పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్‌ నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు సమాచారం. అలాగే నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరి(Uri)లోని కమాన్‌ పోస్టు(Kaman Post)నుంచి శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌కు వెళ్లాడు. ఇతడు మాటలకు మోసపోయిన అధికారులు.. ప్రభుత్వ ఆతిథ్యం ఇచ్చారు. వ్యక్తిగత  భద్రతాధికారిని నియమించారు. ఇక అతడేమో తన పర్యటనకు సంబంధించిన చిత్రాలన్నింటినీ ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేసేవాడు. అయితే, రెండు వారాల వ్యవధిలో రెండోసారి పర్యటనకు రావడంతో అతడిపై అనుమానం మొదలైంది. దీనిపై నిఘా వర్గాలు పోలీసును అప్రమత్తం చేశాయి. అతడి గత చరిత్రను గురించి ఆరా తీయగా బండారం బయటపడింది. దాంతో అతడున్న హోటల్‌లోనే 10 రోజుల క్రితం అరెస్టు చేశారు.  ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. 

పటేల్‌కు వెరిఫైడ్‌ ట్విటర్ ఖాతా కూడా ఉంది. దానిలో అతడిని అనుసరించే వారిలో గుజరాత్‌(Gujarat)కు చెందిన భాజపా సీనియర్ నేతలు కూడా ఉన్నారు. తనకు పారామిలిటరీ బలగాలు భద్రత కల్పించిన చిత్రాలు, మంచులో నడిచిన దృశ్యాలను పోస్టు చేశాడు. అతడి ట్విటర్ బయో ప్రకారం ఉన్నత విద్యను అభ్యసించినట్లు తెలుస్తోంది. అలాగే అందులో తనను తాను ‘థింకర్, స్ట్రాటజిస్ట్, అనలిస్ట్, క్యాంపైన్ మేనేజర్‌’ గా అభివర్ణించుకున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని