Updated : 30 Jun 2021 11:52 IST

Drone Attack: డ్రోన్‌దాడిలో లష్కరే హస్తం..?

జమ్మూ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి

దిల్లీ: జమ్మూ సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీన్ని ఉగ్రదాడిగా నిర్ధారించిన పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రవాదుల వ్యూహాలకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

జమ్మూలోని భారత వైమానిక కేంద్రంపై ఆదివారం జరిగిన డ్రోన్‌ దాడిని ఉగ్రదాడేనని జమ్మూ&కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ ఇదివరకే స్పష్టం చేశారు. ఆ కోణంలో దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు.. ఉగ్రవాదులు అనుసరిస్తోన్న వ్యూహాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు గుర్తించారు. దాడులు జరిపేందుకు చీకటి సమయాన్ని ఎంచుకున్న ముష్కరులు.. తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్ల సహాయంతో పేలుడు పదార్థాలను వైమానిక స్థావరంపై వేసేందుకు ప్రయత్నించారని తేలింది. ఈ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి అని జమ్మూ పోలీసులు పేర్కొన్నారు. పేలుడు పదార్థాలను జారవిడిచిన అనంతరం రాత్రి వేళల్లో ఆ డ్రోన్లు సరిహద్దు వెంట వెనక్కి తిరిగి వెళ్లిపోయాయా? లేక మరో లక్ష్యం వైపు వెళ్లాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఆ పేలుడు పదార్థాలను మోసుకొచ్చిన డ్రోన్ల మార్గాన్ని గుర్తించేందుకు వైమానిక కేంద్రం సరిహద్దు గోడలకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇక ఆదివారం వాయుసేన వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగి 24 గంటలు కాకముందే (సోమవారం తెల్లవారుజామున) మరో భారత సైనిక స్థావరంపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగింది. అయితే, సైన్యం అప్రమత్తతతో అది భగ్నమైంది. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి.

ఇదిలాఉంటే, జమ్మూ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి ఘటన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. మరోవైపు దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ)కు చెందిన ప్రత్యేక స్క్వాడ్‌ బృందం విచారణ చేపట్టింది. దాడిలో ఆర్డీఎక్స్‌ లేదా టీఎన్‌టీ బాంబులను ఉపయోగించి ఉంటారనే అనుమానిస్తున్నారు. అయితే, ఫుడ్‌, మెడిసిన్‌ డెలివరీ కోసం పాకిస్థాన్‌ చైనా నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లను ఇందుకు ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దాడి జరిగిన జమ్మూ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సరిహద్దు మధ్యదూరం 14కి.మీ ఉన్నట్లు సమాచారం.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని