Jammu Kashmir: కశ్మీర్‌ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్‌ బాంబ్‌!

గత నెలలో నర్వా ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఒక వ్యక్తిని జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని అరెస్టు సందర్భంగా పోలీసులు ఉగ్రవాదుల కొత్త ఆయుధాన్ని గుర్తించారు.

Published : 03 Feb 2023 02:25 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో గత నెల నర్వాల్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు ఘటనతో సంబంధం ఉన్న ఆరిఫ్‌ అనే వ్యక్తిని జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను రియాసీ జిల్లాలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని అరెస్టు సందర్భంగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి నుంచి పెర్ఫ్యూమ్‌ బాంబ్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా బాంబ్‌ను గుర్తించడం ఇదే తొలిసారని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పెర్ఫ్యూమ్‌ బాటిల్‌గా భావించి ప్రెస్‌ చేస్తే పేలిపోయేలా దీన్ని రూపొందించారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగం ప్రత్యేక దళాలు వీటిపై దృష్టి సారించిందని, స్వాధీనం చేసుకున్న ఐఈడీని సురక్షితంగా నిర్వీర్యం చేస్తామని తెలిపారు. 

జనవరి 20న నర్వా ప్రాంతంలో ఉగ్రవాదులు రెండు ఐఈడీలను అమర్చారు. జనవరి 21న 20 నిమిషాల వ్యవధిలో ఈ రెండు పేలాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లతో ఆరిఫ్‌కు సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు గురువారం అతణ్ని అరెస్టు చేశారు. ఇతను గత మూడేళ్లుగా పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. గతేడాది మే 24న వైష్ణో దేవి ఆలయానికి భక్తులతో వెళుతున్న బస్సుపై జరిగిన బాంబు దాడి ఘటనలో కూడా ఇతని ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు