Kumaraswamy: జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి.. రూ.6వేల కోట్లు దోచుకున్నారు..!

బిట్‌కాయిన్‌ కుంభకోణం వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో భాజపా నేతలున్నట్లు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా

Published : 12 Nov 2021 14:10 IST

బిట్‌కాయిన్‌ నిందితుడే సూత్రధారి అన్న కుమారస్వామి

బెంగళూరు: బిట్‌కాయిన్‌ కుంభకోణం వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో భాజపా నేతలున్నట్లు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్‌కాయిన్‌ స్కామ్‌ నిందితుడు.. జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి వాటి నుంచి రూ.6వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 

జేడీఎస్‌ పార్టీ జనతా పర్వ వర్క్‌షాపులో పాల్గొన్న కుమారస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి.. వాటి నుంచి నగదును అక్రమంగా బదిలీ చేసినట్లు నా వద్ద సమాచారం ఉంది. ఆ మొత్తం విలువ రూ.6వేల కోట్లు. బిట్‌కాయిన్‌ కుంభకోణం నిందితుడే ఈ హ్యాకింగ్‌ సూత్రధారి. ఈ విషయం ప్రధానికి కూడా తెలుసనుకుంటా..’’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

కర్ణాటకకు చెందిన హ్యాకర్‌ శ్రీకృష్ణ అలియాస్‌ శ్రీకీ అనే వ్యక్తి నుంచి ఇటీవల అధికారులు రూ.9కోట్ల విలువైన బిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రభావవంతమైన రాజకీయ నేతలు ఉన్నట్లు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. బిట్‌కాయిన్‌ వ్యాపారాల్లో అధికార పక్షానికి చెందిన ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నట్లు విపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తదితరులు తీవ్రంగా ఆరోపించారు. అధికారంలో ఉన్న భాజపా తక్షణమే ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. శ్రీకృష్ణ గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాకింగ్‌ చేసిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు కూడా అతడిపై ఆరోపణలున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని