Offbeat: బాబ్బాబు.. ఇంకో గ్లాసు పాలు తాగుప్లీజ్‌..!

పాలు తాగనని మారం చేసే పిల్లల్ని తల్లులు బదిమిలాడినట్లు ఇప్పుడు జపాన్‌ ప్రభుత్వం.. ఆ దేశ ప్రజలను పాలు తాగమని ప్రాధేయపడుతోంది. ప్రతి రోజు ఇంట్లో వినియోగించే పాల కంటే ఇంకాస్త ఎక్కువ పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటారా? ప్రస్తుతం జపాన్‌లో డిమాండ్‌కు మించి

Published : 28 Dec 2021 01:13 IST

ప్రజలకు జపాన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి

టోక్యో: పాలు తాగనని మారం చేసే పిల్లల్ని తల్లులు బతిమిలాడినట్లు ఇప్పుడు జపాన్‌ ప్రభుత్వం.. ఆ దేశ ప్రజలను పాలు తాగమని ప్రాధేయపడుతోంది. ప్రతి రోజు ఇంట్లో వినియోగించే పాల కంటే ఇంకాస్త ఎక్కువ పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటారా? ప్రస్తుతం జపాన్‌లో డిమాండ్‌కు మించి పాల ఉత్పత్తి జరుగుతోంది మరి. దీంతో పాలు వృథా కాకూడదని ప్రభుత్వం పాల అమ్మకాలను పెంచే ప్రయత్నం చేస్తోంది.

ఎన్నడూ లేనిది ఎందుకిలా..?

కొన్నేళ్ల కిందట జపాన్‌లో వెన్న కొరత ఏర్పడటంతో దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అలాగే, రెస్టారెంట్లకు.. విద్యా సంస్థల్లో విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ పాల సరఫరా జరిగేది. అయితే, కొవిడ్‌ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా విద్యార్థులంతా ఆన్‌లైన్‌ తరగతులవైపు మొగ్గు చూపుతుండటంతో పాఠశాలలకు పాల పంపిణీ తగ్గిపోయింది. రెస్టారెంట్లకు కూడా గతంలో మాదిరిగా కస్టమర్ల తాకిడి లేకపోవడంతో అక్కడ కూడా పాల డిమాండ్‌ తగ్గింది. ఎంత నిల్వ చేసినా.. పాలు ఎక్కువ రోజులు ఉండవు. ఈ ఏడాది చివరినాటికి పాల వృథా భారీగా ఉండనుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు ఒక గ్లాసు పాలు తాగే ప్రజలు కొన్నాళ్లపాటు రెండు గ్లాసుల పాలు తాగాలని, వంటల్లోనూ పాలను వినియోగించాలని జపాన్‌ ప్రభుత్వం కోరుతోంది. అప్పుడే పాడి పరిశ్రమను కాపాడుకోగలమని చెబుతోంది.

దీనికి భిన్నంగా జపాన్‌లోనే బంగాళదుంపల కొరత ఏర్పడింది. ఒకవైపు కరోనా పంజా విసురుతుంటే.. మరోవైపు దేశంలో వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో కూరగాయల పంటల దిగుబడి అంతంతా మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో బంగాళదుంపలు దిగుబడి.. సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడి మెక్‌ డొనాల్డ్స్‌ సంస్థ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఇష్టంగా తినే వారిని నిరుత్సాహపర్చడం ఇష్టం లేక పొరుగుదేశాల నుంచి స్వల్ప మొత్తంలో దిగుమతి చేసుకొని చిన్న సైజులో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ చేసి విక్రయిస్తోంది. పరిస్థితిని వివరిస్తూ కస్టమర్లు అర్థం చేసుకోవాలని కోరుతోంది.

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts