Viral video: అతడి స్థానంలో మీరుంటే.. మీ ఆలోచనేంటి..? : ఆనంద్ మహీంద్రా

విధి విచిత్రమైంది. జీవిత ప్రయాణంలో అనూహ్య పరిణామాలను మనకు అనుభవంలోకి తెస్తుంటుంది.

Updated : 06 Aug 2022 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్: విధి విచిత్రమైంది. జీవిత ప్రయాణంలో అనూహ్య పరిణామాలను మనకు అనుభవంలోకి తెస్తుంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తుంటే అదే నిజమనిస్తోంది. మామూలుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న వ్యక్తికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆ ఘటనతో ఆ వ్యక్తికి నోటమాట రాలేదు. ఇంతకీ విషయం ఏంటంటే..

ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారు. పని నిమిత్తం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లేందుకు రోడ్డుకు, షాప్‌కు మధ్య సైడ్‌వాక్‌(ఫుట్‌పాత్‌ మాదిరి)పై కాలువేశారు. ఇలా రెండు అడుగులు వేశారో లేదో.. షాప్‌ ఎదురుగా ఉన్న ఆ సైడ్‌వాక్‌ ఒక్కపెట్టున కిందనున్న డ్రైనేజీలోకి కూలిపోయింది. ఒక్క సెకను ఆలస్యం అయినా.. సదరు వ్యక్తి కూడా అందులో పడిపోయేవారే. తృటిలో పెనుప్రమాదం తప్పించుకున్న అతడికి కాసేపు నోటమాట రాలేదు. ఈ వీడియో ఆనంద్‌ మహీంద్రా దృష్టికి చేరింది. ‘ఈ విశ్వం ఆ వ్యక్తికి ఏ సందేశం పంపాలనుకుంది..? ఆ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఈ వారాంతాన్ని కేటాయించాలనుకుంటున్నాను. అదే స్థానంలో మీరుంటే ఏం ఆలోచిస్తారు..?’ అంటూ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నారు. ‘ఈ వీడియోను ముఖ్యమంత్రికి ట్యాగ్‌ చేయాలని ఆలోచిస్తున్నాను. అతనికి ఏదైనా జరిగి ఉంటే.. ప్రభుత్వం ఏంచేసేది..?’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం లేవు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని