హరివంశ్‌ నారాయణ్‌.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ

పార్లమెంట్‌ నూతన భవనం (Parliament new Building) ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఆహ్వానం లేకపోయినా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ (Harivansh Narayan Singh) హాజరుకావడంపై జేడీయూ మండిపడింది. పార్టీ నిర్ణయాన్ని కాదని ఆయన వెళ్లడం సరికాదని పేర్కొంది.

Published : 29 May 2023 19:01 IST

పట్నా: పార్లమెంట్‌ నూతన భవనం (Parliament New Building) ప్రారంభోత్సవానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హోదాలో తమ పార్టీ నేత హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ (Harivansh Narayan Singh) హాజరవ్వడంపై జేడీయూ (JDU) మండిపడింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్‌ను ఆహ్వానించకుండా.. డిప్యూటీ ఛైర్మన్‌ను ఆహ్వానించడాన్ని కూడా తప్పుబట్టింది. ఈ మేరకు జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్‌ హరివంశ్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిని, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోయినప్పటికీ హరివంశ్‌ హాజరుకావడాన్ని ఆయన తప్పుబట్టారు. 

‘‘పాత్రికేయ వృత్తిలో మీరు అందించిన సేవలను గుర్తించి, మా పార్టీ మిమ్మల్ని రాజ్యసభకు పంపించింది. అయితే, ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయిన రోజు.. ఉన్నత పదవి కోసం మీరు మీ మేధస్సుతో వ్యాపారం చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ బహిష్కరించినప్పటికీ స్వప్రయోజనాల కోసం మీరు హాజరయ్యారు. మీ భాగస్వామ్యం ఉండాలా? లేదా అన్నది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించాలి. కానీ, మీరు అవేం పట్టించుకోకుండా ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్నారు. మీ ప్రవర్తన భవిష్యత్‌ తరాలకు ఏం చెప్పాలనుకుంటోంది?’’ అని నీరజ్‌కుమార్‌ ప్రశ్నించారు.

భారత స్వాతంత్ర్య పోరాటానికి ఎలాంటి సహకారం అందించనివారి చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ జేడీయూ పార్టీ అధినేత నీతీశ్‌ కుమార్‌ పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నట్లు గతంలోనే ప్రకటించారు. మరోవైపు ఈ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి గైర్హాజరైన విషయం తెలిసిందే.

పాత్రికేయ వృత్తిలో విశేష సేవలు అందించినందుకుగానూ.. 2014లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ను జేడీయూ రాజ్యసభకు నామినేట్‌ చేసింది. 2018 ఆగస్టు 8 నుంచి ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2020 సెప్టెంబరులో రెండోసారి తిరిగి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై.. అదే పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా పని చేశారు. ఆ తర్వాత బిహార్‌లో ప్రముఖ హిందీ వార్తాపత్రిక ప్రభాత్‌ కబర్‌కు ఎడిటర్‌గానూ సేవలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు