JEE Main 2023: జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది

లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు National testing Agency (NTA) ఎట్టకేలకు తెరదించింది. జేఈఈ మెయిన్‌ 2023 (JEE Main 2023 Notification) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 20 Dec 2022 13:25 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2023 (JEE main 2023) పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ (JEE Main 2023 Notification)ను జాతీయ పరీక్షల మండలి (National testing Agency) గురువారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఏ (NTA).. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్‌ పరీక్షను 13 భాషల్లో (ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్‌, ఉర్దూ) నిర్వహించనున్నారు. 

తొలి సెషన్ రిజిస్ట్రేషన్ల కోసం క్లిక్‌ చేయండి

తొలి సెషన్‌ పరీక్షకు నేటి (డిసెంబర్‌ 15) నుంచి జనవరి 12 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 12 రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు విధించారు. ఏ సిటీలో పరీక్ష నిర్వహిస్తామనేది జనవరి రెండో వారంలో ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను జనవరి మూడో వారంలో ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

దేశంలోని ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (BE/Btech/BArch,etc) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో టాప్‌ స్కోర్‌ సాధించిన 2.5లక్షల మంది విద్యార్థులకు ప్రఖ్యాత సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.

మరోవైపు, జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షను జనవరిలో కాకుండా ఏప్రిల్‌లో నిర్వహించాలంటూ పలువురు విద్యార్థులు ట్విటర్‌ ద్వారా ఎన్‌టీఏ, కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం దొరకదని.. 12వ తరగతి సిలబస్‌ కూడా ఇంకా పూర్తికాకపోవడంతో తమ పరిస్థితిని అర్థం చేసుకొని తొలి విడతను ఏప్రిల్‌లో పెట్టాలని కోరారు. అయితే, గురువారం రాత్రి జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ని విడుదల చేసిన ఎన్‌టీఏ.. తొలి సెషన్‌ను జనవరిలో, రెండో సెషన్‌ను ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నట్టుగా పూర్తి షెడ్యూల్‌ విడుదల చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని