JEE Main: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

జేఈఈ మెయిన్‌ (JEE Main) తొలి విడత ఫలితాలను ఎన్‌టీఏ (NTA) విడుదల చేసింది. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

Updated : 07 Feb 2023 15:59 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. సోమవారం ఉదయం తుది కీని విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. తాజాగా పేపర్‌- 1 (బీఈ/బీటెక్‌) ఫలితాల(JEE Main Results)ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డును పొందొచ్చు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్‌ 1 (బీఈ/బీటెక్‌ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6లక్షల మందికి పైగా అమ్మాయిలు, 6లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్‌ 2 (బీ.ఆర్క్‌/బీ.ప్లానింగ్‌) పరీక్షను 46వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25వేల మంది అబ్బాయిలు, 21వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, పేపర్‌-2 పరీక్ష ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.

20మందికి 100 పర్సంటైల్‌..  టాపర్ల జాబితా ఇదే..

జేఈఈ మెయిన్‌ తొలి విడతలో అబ్బాయిలు సత్తా చాటారు. 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించినట్టు  జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది. జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షకు రికార్డుస్థాయిలో 95.80శాతం హాజరు నమోదైనట్టు తెలిపింది. 

మరోవైపు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్‌టీఏ ఆల్‌ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. వీరిలో టాప్‌ 2.5లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు