Amazon: టోర్నడో ధాటికి సిబ్బంది మృతి.. గుండె పగిలిందన్న జెఫ్‌ బెజోస్‌

అమెరికాలోని కెంటకీ, ఇల్లినాయిస్‌ తదితర రాష్ట్రాల్లో టోర్నడోలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భీకర సుడిగాలుల తాకిడికి ఇల్లినాయిస్‌ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ ధ్వంసమై, దాదాపు ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. తాజాగా ఈ...

Published : 12 Dec 2021 14:38 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని కెంటకీ, ఇల్లినాయిస్‌ తదితర రాష్ట్రాల్లో టోర్నడోలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భీకర సుడిగాలుల తాకిడికి ఇల్లినాయిస్‌ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ ధ్వంసమై, ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. తాజాగా ఈ ఘటనపై సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎడ్వర్డ్స్‌విల్లే వార్త విషాదకరం. సహచరులను కోల్పోయామని తెలుసుకుని మా గుండె పగిలింది. ఈ సంక్షోభ సమయంలో అక్కడున్నవారందరికీ అమెజాన్ బృందం అండగా ఉంటుంది. అవిశ్రాంతంగా సహాయచర్యలు చేపడుతున్నవారికి కృతజ్ఞతలు’ అని ట్వీట్‌ చేశారు.

‘ఇప్పటివరకు 45 మందిని రక్షించాం’

ప్రమాద సమయంలో అమెజాన్‌ గోదాంలో నైట్ షిఫ్ట్‌లో ఉన్న దాదాపు 100 మంది వరకు సిబ్బంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ సంఖ్యపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. సహాయ చర్యలపై ఎడ్వర్డ్స్‌విల్లే అగ్నిమాపక అధికారి జేమ్స్ వైట్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 45 మందిని ఇక్కడినుంచి సురక్షితంగా తరలించామని చెప్పారు. ఒకరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.  ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సుడిగాలుల బీభత్సంపై దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ‘అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటి’ అని వ్యాఖ్యానించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని