Xi Jinping: జిన్‌పింగ్ గృహనిర్బంధం వార్తలకు చెక్‌.. బయట కనిపించిన చైనా అధినేత..!

చైనా అధ్యక్షుడు, శక్తిమంతమైన నేతగా పేరుపొందిన షీ జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల వినిపించిన వార్తలు సంచలనం సృష్టించాయి.

Published : 27 Sep 2022 18:19 IST

బీజింగ్: చైనా అధ్యక్షుడు, శక్తిమంతమైన నేతగా పేరుపొందిన జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల వినిపించిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు వెళ్లి వచ్చిన ఆయన్ను నిర్బంధించారన్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. ఆయన ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరుకావడమే అందుకు కారణం. మంగళవారం ఆయన బీజింగ్‌లోని ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ నెలలో మధ్య ఆసియా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత, జిన్‌పింగ్‌ బయట కనిపించడం ఇదే మొదటిసారి. 

షీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని,  పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అధిపతిగా ఉన్న ఆయనను పదవి నుంచి తొలగించారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సాగింది.  ఆయన వరుసగా మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తుండటంతో, మధ్య ఆసియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై కుట్ర జరిగిందనేది ఆ వార్తల సారాంశం.

ఇదిలా ఉంటే.. మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన అధ్యక్షుడు జిన్ పింగ్.. తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే అతి కీలకమైన సీపీసీ సమావేశాలకు జిన్ పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2,300 మంది ప్రతినిధులు ఎన్నికైనట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఫలితంగా జిన్ పింగ్ మూడోసారి చైనా అధికారపగ్గాలు చేపట్టేందుకు ఆ సీపీసీ సమావేశాల్లోనే ఆమోదం లభించనుందని విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని