సింగిల్‌ డోసు టీకా: అనుమతి కోరిన జే&జే

సింగిల్‌ డోసులోనే కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జాన్సన్ & జాన్సన్‌, తాజాగా దీన్ని అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని అమెరికా నియంత్రణ సంస్థలను కోరింది.

Updated : 13 May 2022 16:32 IST

వాషింగ్టన్‌: సింగిల్‌ డోసులోనే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జాన్సన్ & జాన్సన్‌.. తాజాగా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని అమెరికా నియంత్రణ సంస్థలను కోరింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ సమర్థతకు సంబంధించిన ఫలితాలను వెల్లడించిన జే&జే.. అనుమతి వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో రెండు వ్యాక్సిన్‌లు అనుమతి పొందగా.. జాన్సన్& జాన్సన్‌ టీకా అనుమతిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సమర్థతలోనూ మెరుగైన ఫలితం..

జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 66శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది. అంతేకాకుండా తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు తెలిపింది. సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44వేల మందిపై జరిపింది. ఆ తర్వాత ఈ ఫలితాలు వెల్లడించింది. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ 72శాతం సమర్థత చూపించగా, లాటిన్‌ అమెరికా దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లో 57శాతం సమర్థత కనబరిచిందని జే&జే ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్‌ మరణాల నుంచి వందశాతం రక్షణ కల్పిస్తుందనే ధీమా వ్యక్తం చేసిన జే&జే, వ్యాక్సిన్‌ తీసుకున్న 14రోజుల్లో రక్షణ లభిస్తుందని పేర్కొంది. అయితే, అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా టీకాలు 90శాతానికి పైగా సమర్థత కలిగి ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది. అయినప్పటికీ సింగిల్‌ డోసు సరిపోయే ఈ టీకా కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

రెండు ప్రయోజనాలు..

ఇప్పటివరకు అమెరికాలో ఆస్ట్రాజెనెకా, మోడెర్నా టీకాలు అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. జాన్సన్‌ & జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఒకే డోసు సరిపోతుంది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల వద్దే దీన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాక్సిన్‌ను కూడా గేమ్‌ ఛేంజర్‌గానే భావిస్తున్నారు. త్వరలోనే ఈ టీకా వినియోగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..
వ్యాక్సిన్‌ వచ్చినా మాస్కులు తప్పనిసరి
భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని