Terror Attack: ఆ టెర్రరిస్ట్‌లకు స్థానికుల ఆశ్రయం.. పాక్‌ నుంచి డ్రోన్లతో గ్రనేడ్లు, ఆయుధాలు!

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌లో జరిగిన ఉగ్రదాడిలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 200మందికి పైగా విచారించి ఆరుగురిని అరెస్టు చేసినట్టు డీజీపీ వెల్లడించారు.

Published : 29 Apr 2023 01:27 IST

రాజౌరి: గత వారం పూంఛ్‌ ఉగ్రదాడి(Poonch Terror attack)లో ముష్కరుల కోసం సైన్యం వేట కొనసాగుతోంది. మరోవైపు, పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌సింగ్‌ ఈ ఉగ్రదాడికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. పూంఛ్‌లో ఆకస్మికంగా జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే, పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా గ్రనేడ్‌లు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు వచ్చాయని.. స్థానికులే ఆ ముష్కరులకు ఆశ్రయం కల్పించారని డీజీపీ వెల్లడించారు. అలా వచ్చిన ఆయుధాలతోనే సైనికుల వాహనంపై దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడికి ముందు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురు స్థానికులను అరెస్టు చేసినట్టు తెలిపారు. రాజౌరిలో పర్యటించిన డీజీపీ అక్కడి మీడియాతో మాట్లాడారు. 

ఏప్రిల్‌ 20న జరిగిన ఈ ఉగ్రదాడి పక్కా ప్రణాళికతో జరిగిందని.. ఈ దాడిలో ముగ్గురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు డీజీపీ తెలిపారు. ఆరోజు సైనికుల సమీపంలోకి వచ్చి వాహనంపై దాడి చేయగా ధ్వంసమైందని తెలిపారు. ధ్వంసమైన వాహనంపై ముష్కరులు కాల్పులు జరపడంతో సైనికులు గాయపడ్డారని.. ఆ తర్వాత ఐఈడీని అమర్చి పేల్చేసి కిరాతక చర్యకు పాల్పడ్డారని డీజీపీ వెల్లడించారు. ఈ దాడికి ముందు ఆ ప్రాంతాన్ని బాగా పరిశీలించి.. అక్కడి భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకొని దాడి చేసేందుకు  ఆ చోటును ఎంచుకున్నారన్నారు. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రశ్నించామని.. ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. ఉగ్రవాదులకు స్థానికులే ఆశ్రయం కల్పించారని.. వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లేలా వారిని గైడ్‌ చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.  ఈ కేసులో ప్రశ్నిస్తున్న సమయంలో కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయని.. దానిపై పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు స్థానికుల మద్దతు లేకుండా జరగడం కష్టమేనన్నారు. ఉగ్రవాదులు అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటారని.. వారికి అక్కడి కొందరు స్థానికులు మద్దతు ఇవ్వడంతో తప్పించుకొనే మార్గాలు కూడా ఉంటున్నాయన్నారు.  గత గురువారం భింబర్‌ గలీ నుంచి సాంగియోట్‌కు ఇఫ్తార్‌ విందు కోసం పండ్లను తీసుకెళుతున్న సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని