
Jammu and Kashmir: సరిహద్దుల్లో డ్రోన్ కూల్చివేత.. 5కిలోల పేలుడు పదార్థాలు లభ్యం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సంచారం మరోసారి కలకలం రేపింది. భారత సరిహద్దుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
కనచక్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం రాత్రి ఓ డ్రోన్ సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యాంటీ-డ్రోన్ స్ట్రాటజీ ద్వారా దానిపై కాల్పులు జరిపారు. ఈ డ్రోన్ దేశ సరిహద్దును దాటుకుని భారత భూభాగం వైపు దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల లోపలకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని హెక్సాకాప్టర్‌గా గుర్తించారు.
కూల్చివేసిన అనంతరం డ్రోన్‌ను తనిఖీ చేయగా.. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వీటిని అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబుల తయారీకి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
గత నెల జమ్మూలోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్ల కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. యాంటీ- డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.