Updated : 25 Jul 2021 07:23 IST

Kolkata: శవపరీక్షలు చేసేచోట కొలువులు.. ఇంజినీర్లు, పీజీల పోటీ

8వ తరగతి విద్యార్హత..

6 పోస్టులకు 8 వేల దరఖాస్తులు!

కోల్‌కతా: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పట్టే ఉదాహరణ ఇది. ఆసుపత్రిలో శవపరీక్షలు జరిపే చోట పనిచేసే చిన్న కొలువులకు వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడ్డారు. అందులోనూ చాలామంది ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పీజీలు కూడా ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని చెబుతున్నారు. కోల్‌కతాలోని నీల్‌ రతన్‌ సిర్కార్‌ వైద్య కళాశాల, ఆసుపత్రి ఈ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. కేవలం 8వ తరగతి విద్యార్హతతో 6 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా ఏకంగా 8,000 మంది దరఖాస్తు చేశారు. శవ పరీక్షలు నిర్వహించే ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ విభాగం ల్యాబ్‌ సహాయకుల పోస్టులు ఇవి. ‘డోమ్‌’ అని పిలిచే ఈ ఉద్యోగాలకు వేల సంఖ్యలో నిరుద్యోగులు పోటీపడ్డారు. వీరిలో 100 మంది ఇంజినీర్లు, 500 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 2,200 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. దరఖాస్తులను వడపోసిన అనంతరం 84 మంది మహిళలు సహా మొత్తం 784 మందిని రాత పరీక్షకు ఎంపిక చేశారు. వీరికి ఆగస్టు 1న ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు వయో పరిమితి 18-40 ఏళ్ల మధ్య కాగా.. ఇచ్చే వేతనం నెలకు రూ. 15,000. ‘‘దరఖాస్తుదారుల్లో చాలామంది నిర్దేశించిన విద్యార్హతకు మించిన వారే ఉన్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి పోస్టులకు ఇంతకుముందు ‘డోమ్‌’లుగా పనిచేసినవారి కుటుంబ సభ్యులే దరఖాస్తు చేస్తుంటారు’’ అని ఆసుపత్రి అధికారి ఒకరు శనివారం తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని