Updated : 04 Jun 2021 12:25 IST

Biden : ట్రంప్‌ను మంచి మనిషిని చేస్తున్న బైడెన్‌..!

 చైనాపై కఠిన వైఖరి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బైడెన్‌ శ్వేతసౌధంలోకి వచ్చిన కొత్తల్లో చైనా సంతోషానికి అంతులేదు. అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏకంగా చైనా పత్రికలు  ట్రంపును అవహేళన చేశాయి. కానీ, బైడెన్‌ పాలనలో రోజులు గడిచే కొద్దీ ట్రంపే కొంతలో కొంత నయం అని చైనా భావించే పరిస్థితి వస్తోంది. చైనాను అడ్డుకోవడానికి ఎన్నిరకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ బైడెన్‌ కార్యవర్గం చక్కబెడుతోంది. దీంతో చైనాకు మెల్లగా ఆ నిర్ణయాల సెగ తగులుతోంది. మరోపక్క ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల్లో ఒక్క దానిని కూడా తొలగించలేదు. ఇప్పుడు వాటికి అదనంగా.. విస్తరించిన కొత్త బ్లాక్‌ లిస్ట్‌  జాబితాను ప్రకటించారు.

ఒక్క కలం పోటుతో..

ట్రంప్‌ హయాంలో మొత్తం  31 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది.  బైడెన్‌ వచ్చి ఇంకా ఆరు నెలలు పూర్తికాలేదు. ఆయన మరో 28 కంపెనీలను అందులో చేర్చారు. గురువారం చైనా కంపెనీల బ్లాక్‌ లిస్ట్‌ జాబితాను విస్తరిస్తూ బైడెన్‌ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడా జాబితాలో ఉన్న చైనా కంపెనీల సంఖ్య 59కి చేరింది. ముఖ్యంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని వీటిపై ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ సంస్థలు చైనా సైన్యంతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ ఆదేశాలు ఆగస్టు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

జాబితాలో ఉన్న కంపెనీలు..

బైడెన్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న కంపెనీలు చాలా వరకు గతంలో ప్రకటంచిన ట్రంప్‌ బ్లాక్‌ లిస్టులోనూ ఉన్నాయి. చైనా మొబైల్‌, చైనా యూనికామ్‌, చైనా టెలికమ్యూనికేషన్స్‌, హువావే, సెమీకండెక్టర్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ టెలికమ్యూనికేషన్స్‌ వంటివి ఈ సారి కూడా కొనసాగాయి. బైడెన్‌ రక్షణ రంగ కంపెనీలపై ఎక్కువ దృష్టిపెట్టారు. దీంతో ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా, చైనా నార్త్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌, చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ ఇండస్ట్రీ, చైనా షిప్‌ బిల్డింగ్‌ ఇండస్ట్రీ, చైనా ఏవియానిక్స్‌, చైనా శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌,కోస్టర్‌ గ్రూప్‌, ఫుజియాన్‌ టార్చ్‌ ఎలక్ట్రాన్‌ టెక్నాలజీ, గుయ్‌ఝూ స్పేస్‌ అప్లయన్స్‌, షాన్జీ ఝాంగ్టియన్‌ రాకెట్‌ టెక్నాలజీ వీటిలో ఉన్నాయి. 2019లో అమెరికా విధించిన ఆంక్షల దెబ్బకు హువావే మొబైల్‌ ఫోన్ల వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా యూకే 5జీ టెక్నాలజీ ఏర్పాటు ప్రాజెక్టు నుంచి బయటకు పంపించింది.

ఇక ఫేషియల్‌ టెక్నాలజీని తయారు చేసే హాంగ్‌ఝూ హిక్‌ విజన్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ను దీనిలో చేర్చారు. షింజియాంగ్లో వీఘర్లపై  అధికారులు నిఘా పెట్టే  ‘సేఫ్‌ సిటీ’ ప్రాజెక్టులకు ఇది సహకరిస్తోంది. దీనిపై హిక్‌ విజన్‌ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ ‘‘గత జాబితాకు సరైన కారణాలు చెప్పకుండా.. హిక్‌ విజన్‌ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త కారణాలు వెతుకుతోంది. ఎందుకంటే మా హెడ్‌క్వార్టర్‌ చైనాలో ఉంది కాబట్టి’’ అని పేర్కొన్నారు.

ఇక ఈ కంపెనీల సెక్యూరిటీలను బహిరంగంగా కొనటం, అమ్మటంపై నిషేధం వర్తిస్తుంది. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలను ఈ జాబితాలో చేరుస్తామని శ్వేతసౌధం పేర్కొంది.

వీఘర్ల అణచివేతకు బలమైన నిఘా.. 

చైనాలో షింజియాంగ్‌ ప్రావిన్స్‌లో వీఘర్‌ ముస్లింల భావోద్వేగాలను కూడా పసిగట్టి అణచి వేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నిఘా కెమెరాల్లో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వారిపై కన్ను వేసింది. కెమెరాకు 3 మీటర్ల సమీపంలోకి వచ్చిన వ్యక్తి ముఖ కవళికలు, చర్మం ఆధారంగా వారిలో భావాలను ఇది పసిగడుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వెలుగులోకి తెచ్చింది.  ఈ కెమెరాలు వ్యక్తులను గుర్తించాక వాటి ఆధారంగా కృత్రిమ మేధను ఉపయోగించి ‘పైఛార్టు’లను తయారు చేస్తాయి.  వీటిల్లో కోపం, బాధ, ఆవేశం వంటి ప్రతికూల భావాలను ఇది గుర్తిస్తుంది.  ఇప్పటికే చైనా షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో వీఘర్లను గుర్తించేందుకు ప్రత్యేకమైన కెమెరాలను అమర్చారు.  ఈ ప్రావిన్స్‌లో దాదాపు 12 మిలియన్ల మంది వీఘర్లు ఉంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చైనా వీరిని నిర్బంధిస్తోంది. వీరందరని రీ ఎడ్యుకేషన్‌ క్యాంపులుగా చెప్పే జైళ్లలోకి తరలిస్తోంది.  స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా చైనా వీఘర్లపై ఇప్పటికే బలమైన నిఘా ఉంచింది. వీరు స్మార్టుఫోన్లను ఎప్పుడూ తమతోనే ఉంచుకోవాలి. లేకపోతే అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ల సాయంతో సదరు వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? వంటి వివరాలను సేకరిస్తుంది.  వీఘర్ల ఇళ్లపై క్యూఆర్‌కోడ్‌ అంటించి ఉంటుంది. దీని ఆధారంగా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అధికారులకు తెలుస్తుంది. హువావే సాయంతో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌  ముఖ కవళికల ఆధారంగా జాతిని గుర్తించే టెక్నాలజీ అభివృద్ధి చేసిందని అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ పేర్కొంది. ప్రపంచంలో వినియోగంచే 80 కోట్ల నిఘా కెమెరాల్లో సగం చైనానే వినియోగిస్తోంది. వీటి సాయంతోనే వీఘర్ల కదలికలను గమనిస్తోంది.

వుహాన్‌ ల్యాబ్‌పై దర్యాప్తునకు..

ట్రంప్‌ హయాంలో ‘వుహాన్‌ వైరస్‌’, ‘చైనా వైరస్‌’ అంటూ పరువు తీయడం తప్ప బలమైన చర్యలు తీసుకోలేదు. కానీ, బైడెన్‌ అలా కాదు.. ఆయన నోటి నుంచి ఇటువంటి పదాలు రాలేదు. కానీ, బలమైన ఆధారాలతో ఓ పత్రికలో కథనం వెలువడగానే స్పందించారు. కరోనా వైరస్‌ పుట్టుకపై 90 రోజుల్లో దర్యాప్తు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ పరిణామం చైనాకు మింగుడు పడలేదు. దీనిపై అమెరికాను బెదిరిస్తూ గ్లోబల్‌ టైమ్స్‌లో ఓ ఆర్టికల్‌ కూడా వచ్చింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts