Putin: పుతిన్‌కు బైడెన్‌ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా..?

తన ప్రత్యర్థి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జెనీవా భేటీ సందర్భంగా ఒక గిఫ్ట్‌ ఇచ్చారు. అమెరికా సైన్యం వినియోగించే

Updated : 18 Jun 2021 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జెనీవా భేటీ సందర్భంగా ఒక గిఫ్ట్‌ ఇచ్చారు. అమెరికా సైన్యం వినియోగించే కాంకర్డ్‌ స్టైల్‌ ఏవియేటర్‌ సన్‌గ్లాసెస్‌ జతను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది.  వీటిని మాస్సాచుసెట్స్‌ కేంద్రంగా పనిచేసే రాండోల్ఫ్‌ యూఎస్‌ఏ అనే కంపెనీ తయారు చేస్తుంది. అమెరికా వీటిని సైన్యంలో వాడటంతోపాటు నాటో భాగస్వాములకు కూడా అందజేస్తుంది. బైడెన్‌ స్వయంగా కళ్లజోళ్లను వినియోగిస్తున్నారు. ఆయన తరచూ వీటిని ధరించి కనిపిస్తారు. గతంలో టాప్‌గన్‌ చిత్రంలో టామ్‌ క్రూజ్‌ ధరించడంతో ఈ సన్‌గ్లాసెస్‌కు బాగా పేరొచ్చింది.

ఇక దీంతోపాటు క్రిస్టల్‌తో చేసిన అమెరికన్‌ అడవి దున్న బొమ్మను కూడా పుతిన్‌కు ఇచ్చారు. ప్రపంచ నేతలు ఒకచోట కలుసుకొన్నప్పుడు బహుమతులు ఇచ్చుకుంటుంటారు. రష్యా జోబైడెన్‌కు ఏం గిఫ్ట్‌ ఇచ్చిందో తెలియరాలేదు. కాంకర్డ్‌ స్టైల్‌ సన్‌గ్లాసెస్‌ను పూర్తిగా చేతితోనే తయారు చేస్తారు. వీటి తయారీలో 200 దశలు ఉంటాయి. ఇవి పూర్తికావడానికి ఆరువారాలు పడుతుంది. సూపర్‌ సానిక్‌ విమానం కాంకర్డ్‌ పేరును దీనికి పెట్టారు. వీటిలో నలుపు రంగు కళ్లద్దాల ధర రాండోల్ఫ్‌ వెబ్‌సైట్‌లో 279 డాలర్లుగా చూపిస్తోంది. అంటే దాదాపు రూ.20 వేలకు పైగా ఉంటుంది.

అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి స్థాయికి దిగిజారిపోయాయని అందరూ భావిస్తున్న తరుణంలో బుధవారం జో బైడెన్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిపారు. అనంతరం విడివిడిగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. రాయబారుల అంశంపై రెండు దేశాలు అవగాహనకు వచ్చినట్లు పుతిన్‌ తెలిపారు. రష్యా హ్యాకర్లు తమ సంస్థలపై దాడి చేశారని పేర్కొంటూ.. ఆ దేశ రాయబారులను బైడెన్‌ ప్రభుత్వం వెనక్కి పంపింది. అంతకుముందు రష్యా అదే పని చేసింది. ఈ చర్చల్లో ఆ సమస్య పరిష్కారమైనట్లు పుతిన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని